ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
♦ కానిస్టేబుల్‌ను ఢీకొట్టబోయి ఆగిన లారీ
♦ ఆగ్రహించిన ట్రాఫిక్ ఎస్సై
♦ లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదిన వైనం
సిరిసిల్ల టౌన్: లాఠీ కోసం రోడ్డుపైకి హఠాత్తుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఢీకొనకుండా ఒక్కసారిగా బ్రేక్‌వేసి ప్రాణాపాయం నుంచి రక్షించిన ఓ లారీ డ్రైవర్‌ను అభినందించాల్సింది పోయి ట్రాఫిక్ ఎస్సై.. ఆగ్రహంతో ఊగిపోయారు. తన లాఠీతో 15 నిమిషాలపాటు డ్రైవర్‌ను చితకబాదారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. ప్రజలు చూస్తుండగానే అతడిని తీవ్రంగా కొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఎస్సై లింగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇరుకైన ఆ రోడ్డుగుండా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వారిని ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించారు. భయపడిన ఆ యువకులు బైక్‌ను ఆపకుండా వెళ్లారు. దీంతో డిస్ట్రిక్ట్ గార్డు షబ్బీర్ ఆగ్రహంతో లాఠీని వారిపైకి విసిరినా.. వారు తప్పించుకుపోయారు.
అదే సమయంలో టీఎస్16 యూబీ 1012 నంబరు గల లారీ అటుగా వస్తోంది. ఆ లారీని చూడకుండా షబ్బీర్ రోడ్డుపై పడిన లాఠీని తీసుకునేందుకు వంగారు. ఎదురుగా వాహనాలు ఉండడంతో లారీ డ్రైవర్ మోహన్ సైతం షబ్బీర్‌ను గమనించలేకపోయాడు. స్థానికుల అరుపుతో మోహన్ అప్రమత్తమై సడన్ బ్రేక్‌తో లారీని ఆపాడు. అప్పటికే షబ్బీర్ లారీని గుర్తించి క్షణాల్లో రోడ్డుపైకి పడుకోవడంతో, లారీ కిందకు చొచ్చుకుపోయినా అదృష్టవశాత్తు బతికిపోయాడు. అయితే, కానిస్టేబుల్ చనిపోయాడని భావించిన మోహన్ పారిపోతుండగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. అంతే.. ఇక ఎస్సై లింగమూర్తి వచ్చి ఆ డ్రైవర్‌ను నానాబూతులు తిడుతూ, కాలితో తన్నుతూ, లాఠీతో చితక్కొట్టారు. ఈయనకు మరో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు జత కలిశారు. పోలీసులపైకే లారీ తీసుకొస్తావా? అని ఊగిపోతూ 15 నిమిషాలపాటు ఆ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి జీపులోకి ఎక్కించి, ఠాణాకు తరలించారు.