- – నయీం ముఠా కార్యకలాపాలపై నిఘా
- – ఎన్‌కౌంటర్‌పై మిలియన్ డాలర్ ప్రశ్నలు
పోలీసుల ఆరా
Published Wed, Aug 10 2016 1:08 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
షాద్‌నగర్ : నల్లగొండ జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ నయీంకు షాద్‌నగర్‌లో ఏం పని.. ఈ పట్టణంలో ఎంతకాలంగా నివాసమున్నాడు.. ఇక్కడ కూడా తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికి పథకం పన్నాడా.. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎన్ని సెటిల్‌మెంట్లు చేశాడు.. ఇవి స్థానికుల్లో రేకెత్తుతున్న ప్రశ్నలు. మరోవైపు నయీం ఏ విధమైన కార్యకలాపాలు సాగించాడని పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం శివారులోని మిలినీయం టౌన్‌షిప్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ నయీం మృతిచెందిన విషయం విదితమే. ఎన్నోచోట్ల భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసిన ఇతను చివరకు ఎన్‌కౌంటర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇక్కడి పోలీసులు నయీంకు స్థానికంగా ఉండే పరిచయాలపై ఆరా తీస్తున్నారు.
స్థానికులతో పరిచయాలు
స్థానికంగా కొందరితో నయీంకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌తో సబంధాలున్న షాద్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు తమ ఉనికి తెలియకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. వారి సహకారంతోనే నయీం ఈ ప్రాంతంలో నివాసముంటూ తన కార్యకలాపాలు సాగించేవాడంటున్నారు. కాగా ఇతడికి షాద్‌నగర్ కొత్తకాదని ఎనిమిదేళ్ల నుంచే సంబంధాలు ఉండేవని మరికొందరు చెబుతున్నారు.
‘మినీఇండియా’నే సేఫ్
షాద్‌నగర్ పరిసర ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో వస్తుంటారు. దీంతో షాద్‌నగర్ పరిసర ప్రాంతం ‘మినీఇండియా’గా పిలుస్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ పట్టణం చేరువలోనే ఉంది. నయీం నివసించిన ఇంటినుంచి అరగంట నుంచి నలబై నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకోవచ్చు. పట్టణ శివారులో ఇళ్లు ఉండటంతో తన కార్యకలాపాలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని ఆలోచించే నయీం మిలినీయం టౌన్‌షిప్ కాలనీలో నివాసం ఏర్పరచుకున్నాడని ప్రజలు భావిస్తున్నారు. అంతేగాక ఎన్నో ఏళ్లుగా షాద్‌నగర్‌కు సేఫ్ జోన్ అనే పేరుంది. ఇక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తే ఎవరికీ అనుమానం రాదనే మకాం వేశాడని పలువురు చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement