పొలిటికల్ జేఏసీ సామూహిక సత్యాగ్రహం.. | Political jeesi mass satyagraha .. | Sakshi
Sakshi News home page

పొలిటికల్ జేఏసీ సామూహిక సత్యాగ్రహం..

Published Mon, Aug 12 2013 12:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

పొలిటికల్ జేఏసీ సామూహిక  సత్యాగ్రహం..

పొలిటికల్ జేఏసీ సామూహిక సత్యాగ్రహం..

సమైక్యాంధ్రను పరిరక్షించుకోవాలని, రాష్ట్రాన్ని ముక్కలు కానీయరాదని సడలని దీక్షతో జిల్లాలో సమైక్య పోరు కొనసాగుతోంది. జిల్లా అంతటా విభిన్న కోణాల్లో ఆందోళనలు ఆదివారం నిర్వహించారు. విజయవాడలో గాంధీ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు తదితరుల వేషధారణలతో కళాకారులు ర్యాలీ జరిపి సమైక్యాంధ్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో వంద లారీలతోభారీ ర్యాలీ నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, వంటావార్పు, మానవహారాలు, భారీ ప్రదర్శనలు జిల్లా అంతటా కొనసాగాయి.
 
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యనాదం మార్మోగుతోంది. ఆదివారం నాడూ జిల్లా అంతటా ఆందోళనలు కొనసాగాయి. జగ్గయ్యపేట ఆటోనగర్ లారీ ఓనర్స్, మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన పట్టణ పౌరులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 100కు పైగా లారీలతో వారు చేపట్టిన ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో ముందుగా ఏర్పాటుచేసిన జేసీబీపై కేసీఆర్ కటౌట్ ఉంచి దానిని చెప్పులతో, చీపురుతో కొట్టుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుడివాడలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిపారు.

మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆందోళనకు మద్దతు ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. గుడివాడలో ఓల్డ్ ఐరన్ మర్చంట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పూ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయక ర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో కంకిపాడులో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద ఓగిరాల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బళ్లారి చిట్టిబాబు ఆదివారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. తిరువూరులో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో రాజుపేట నుంచి ప్రధాన వీధుల గుండా బోస్ సెంటరు, బైపాస్ రోడ్డు వరకు మోటారు సైకిళ్లపై నిరసన ప్రదర్శన జరిపారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం మైలవరం బోసుబొమ్మ సెంటర్ నుంచి నూజివీడు రోడ్డులోని వినాయకుని గుడి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అక్కడ మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యూరులో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేవిధంగా సోనియాగాంధీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రైవేట్ స్కూల్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు చెప్పులు కుట్టి నిరసన తెలియజేశారు. ఇబ్రహీంపట్నంలో విద్యుత్తు ఉద్యోగులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

పొలిటికల్ జేఏసీ సామూహిక  సత్యాగ్రహం..

 పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు.  కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో  భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. కళాకారులు గాంధీనగర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ తదితర వేషధారణలతో నిర్వహించిన ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

 బిజీబిజీగా వివిధ అసోసియేషన్ల నేతలు

 నిరవధిక సమ్మె చేయడానికి కొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉండటంతో ఆదివారం వివిధ అసోసియేషన్ల నాయకులంతా బిజీబిజీగా గడిపారు. విజయవాడలో మున్సిపల్ జేఏసీ నాయకులు సమావేశమై 12 నగరపాలక సంస్థ, 102 మున్సిపాలిటీలకు చెందిన 25 వేల మంది ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి అత్యవసర సేవల్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు సమావేశమై సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement