రైతన్న మెడపై కత్తి
రైతన్న మెడపై కత్తి
Published Sat, Jul 23 2016 11:44 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
మచిలీపట్నం :
టీడీపీ సర్కారు రైతు మెడపై కత్తి పెట్టింది. ఇంతకాలంగా భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ప్రభుత్వం ఉత్తర్వులతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో, వీటికి ఎంత భూమి కావాలో తెలియజేయకుండానే మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ పేరుతో భూసమీకరణకు ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కరికాల్‌వాలవెన్ శనివారం జీవో నంబరు 185ను జారీ చేశారు. ఈ జీవో రైతుల పాలిట పిడుగుపాటుగా మారింది. ప్రభుత్వం భూసమీకరణకు జీవో విడుదల చేసిందనే విషయం తెలుసుకున్న రైతుల్లో కలకలం ప్రారంభమైంది. ఇంత కాలంగా తమకు అన్నం పెట్టిన భూమిపై హక్కు కోల్పోతామనే భయం ప్రతి ఒక్క రైతును వెంటాడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో కారణంగా రైతుకు ఇష్టం ఉన్నా లేకున్నా భూమిని ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉందనే వాదన రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భూసేకరణ ముసుగులో
గతేడాది ఆగస్టు 31వ తేదీన మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల స్థాపన నిమిత్తం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భూసేకరణపై 4,800లకు పైగా అభ్యంతరాలను ఆర్డీవో కార్యాలయంలో రైతులు దాఖలు చేశారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వాలని రైతులను కోరేందుకు గ్రామాలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు అధికారులను ఆయా గ్రామాల్లో రైతులు తరిమి కొట్టినంత పనిచేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌తో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రైతులకు పంట రుణాలు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి. రైతుల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావటంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించినా ఆ పని చేయలేదు.
మాట మార్చారు
భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయకుండానే పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో భూసమీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటు చేసింది. 16 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమించింది. వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి శోభని నియమించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఎంఏడీఏ పరిధి 426.16 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. 1.05 లక్షల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన నిమిత్తం సమీకరించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. మంత్రి ప్రకటనపై అటు ముఖ్యమంత్రి గాని, ఇటు జిల్లా మంత్రులుగాని స్పందించలేదు. శనివారం విడుదల చేసిన జీవో 185లోనూ పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం ఎంత భూమిని సేకరిస్తారో స్పష్టం చేయలేదు. ఎంఏడీఏ పరిధిలో మచిలీపట్నం పురపాలక సంఘంతో పాటు మచిలీపట్నం మండలంలోని 27 రెవెన్యూ గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి రెవెన్యూ గ్రామాన్ని చేర్చారు. భూసమీకరణకు సంబంధించిన సర్వాధికారాలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన 15 రోజుల్లోగా రైతులు తమ అభ్యంతరాలను 6(2) ఫార్మాట్‌లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం
ప్రభుత్వం జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటంతోపాటు సీఆర్డీఏలో భూసమీకరణపై న్యాయపోరాటం చేస్తున్న వారిని, జడ్జిలుగా పదవీ విరమణ చేసిన వారిని తీసుకువచ్చి రైతులకు అవగాహన కల్పిస్తాం.
– పేర్ని నాని, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Advertisement
Advertisement