పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
Published Fri, Mar 24 2017 11:43 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డోన్ మున్సిపల్ వేలాల విషయంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాశవిక దాడిలో పోస్టు ప్రసాద్, ఓబులాపురం సురేష్, సుధాకర్, మదన్, రమణ, లాల్‌బాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మొదట డోన్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గౌరి గోపాల్, అమృత ప్రయివేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. గౌరి గోపాల్‌లో చికిత్స పొందుతున్న పోస్టు ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురు అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పథకం ప్రకారమే దాడి : గౌరు వెంకటరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
టీడీపీ నేతలు పక్కా పథకం ప్రకారమే తమ పార్టీ కార్యకర్తలపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లు, పట్టుడు కర్రలతో స్థానికులను భయాందోళనలకు గురి చేయడం చూస్తే అధికార పార్టీ అండదండలతోనే చెలరేగిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు పార్టీ అన్నివిధాల అండగా నిలుస్తుంది. దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమైన విషయం.
Advertisement
Advertisement