కేబినెట్ భేటీలో ప్రైవేటు కన్సల్టెన్సీలా!
ఉన్నతాధికార వర్గాల్లో చర్చ
రెండంకెల వృద్ధి ప్రైవేటు కార్యక్రమమా?
ప్రైవేటు వ్యక్తులతో ఉన్నతాధికారులకు పాఠాలా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశంలోకి ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థలను అనుమతించడమే కాకుండా, వారితో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇప్పించడంపై ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇది మంత్రివర్గ ప్రతిష్టను దిగజార్చడమేనని, అధికారులను అవమానించడమేనని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండంకెల వృద్ధిపై కేపీఎంజీ, మెకిన్సే, ఐఎల్‌ఎంఎస్ సంస్థల ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘మంత్రివర్గ సమావేశంలోకి ప్రైవేటు సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం ఏమిటి? ఇదేమైనా ప్రైవేటు కార్యక్రమమా? ఇంతకుముందెన్నడైనా ఇలా జరిగిందా? అధికారులు వారి దగ్గర నేర్చుకునే పిల్లల్లా కనిపిస్తున్నారా?..’ అంటూ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు చర్చించుకోవడం గమనార్హం.
‘మంత్రివర్గ సమావేశంలోకి మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే వెళ్లాలి. మంత్రులు, ఉన్నతాధికారుల ప్రైవేటు కార్యదర్శులకు (పీఎస్‌లకు) కూడా లోనికి ప్రవేశం ఉండదు. సాధారణంగా వారి శాఖలకు సంబంధించిన అంశంపై చర్చ ముగియగానే ఉన్నతాధికారులు సైతం బయటకు వెళ్లిపోతుంటారు. కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బయటకు తెలియకూడని కొన్ని రహస్య అంశాలపై కూడా అందులో చర్చ జరగవచ్చు. అలాంటి కీలక సమావేశంలోకి ప్రైవేటు వ్యక్తులను అనుమతించడమంటే మంత్రివర్గ ప్రతిష్టను దిగజార్చడమే..’ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
‘ప్రైవేటు వ్యక్తులతో ప్రజంటేషన్ ఇప్పించడమంటే ప్రభుత్వ అధికారులను కూడా అవమానించినట్లే. అఖిల భారత స్థాయి అధికారులకు.. కన్సల్టెన్సీల ప్రతినిధులంటూ అనామకులతో పాఠాలు చెప్పించడం మరీ దారుణం...’ అని ఒక రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘సాక్షి’తో అన్నారు. అధికారుల పరువు తీసే ఇలాంటి పరిణామాలు ఏమాత్రం సమంజసం కాదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.