► నెలవారీ చిట్టీలపై జిల్లా పోలీసు బాస్ ఆరా
► ప్రజలను బురిడీ కొట్టించే సంస్థలపై నజర్
► మండలాల వారిగా వివరాల సేకరణ
ఎల్లారెడ్డిపేట: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి సన్నద్దమవుతున్నారు. ఫైనాన్స్ కంపెనీల ద్వారా చిరువ్యాపారులు, రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులు ఇస్తూ అధిక మొత్తంలో వడ్డీలు గుంజడమే కాకుండా వారి ఆస్తులను కాజేస్తున్న తీరుపై ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులందగా వీటిపై లోతుగా పరిశీలన ప్రారంభించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టిలపై నజర్ వేశారు. జిల్లా బాస్ ఆదేశాలతో జిల్లాలోని 13మండలాల్లో పోలీసులు గ్రామాల్లో జరిగే నెల వారి చిట్టిలు, ఫైనాన్స్ కంపెనీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
ఇప్పటికే లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఎంటర్‌ప్రైజెస్‌లపై కఠిన చర్యలు తీసుకున్న ఎస్పీ జిల్లాలో అనుమతులు లేకుండా నెల వారి చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ దిశలో వీటిపై పూర్తివివరాలు, నిర్వాహకులు, వడ్డీల వసూలుపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించడానికి స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపినట్లు సమాచారం. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టీలు జోరుగా సాగుతున్నట్లు తెలుసుకొని వాటిని అదుపు చేయడానికి ఆ ప్రాంతాల్లోని పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
ఇసుకపై సీరియస్..
అక్రమంగా ఇసుక తరలించే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఎల్లారెడ్డిపేటలో ఇసుక తరలించే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జిల్లా వ్యాప్తంగా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని జిల్లా బాస్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.