
ఆకతాయి వీరంగం
- బైక్, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు
- సీపీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి గుర్తింపు
- మతిస్థిమితం లేకే ఆకతాయి చేష్టలు
కణేకల్లు : మండల కేంద్రం కణేకల్లులో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ద్విచక్రవాహనం, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు పెట్టి వీరంగం సృష్టించాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సదరు వ్యక్తి మతిస్థిమితం లేకే ఈ ఆకతాయి చేష్టలు చేసినట్లు తేల్చారు. ఎస్‌ఐ యువరాజు తెలిపిన మేరకు... బస్టాండ్‌లోని మెయిన్‌రోడ్డులో పాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న సర్మస్‌వలి సమీపంలోని అప్‌స్టేర్‌లో గల ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్ (యమహా ఎఫ్‌జెడ్‌ఎస్)ను రోడ్డుపై పార్కింగ్ చేసి ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ బైక్‌కు ఎవరో నిప్పంటించారు. బైక్‌లో పెట్రోల్ ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇరుగుపొరుగు చూసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బైక్ పూర్తిగా కాలిపోయింది.
ఇంకా బైక్ కంతులు కట్టాల్సి ఉందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆ తర్వాత బస్టాండ్ ప్రాంతంలో లక్ష్మినరసింహస్వామి ఫర్టిలైజర్ దుకాణంలోని రూ.3లక్షలు విలువ చేసే పురుగుమందుల లోడుతో ఉన్న బొలెరో పికప్ వాహనానికి కూడా ఇదే విధంగా ఎవరో నిప్పుంటించారు. ఆ సమయంలో డ్రైవర్ వాహనంలోనే నిద్రిస్తున్నాడు. మంటల వేడికి తేరుకున్న డ్రైవర్ మూర్తి మంటలు ఆర్పాడు. అనంతరం చర్చి బయట తిప్పమ్మకు చెందిన గుడిసెకు నిప్పంటించారు. ప్రమాదం జరిగిన ఆమె చర్చిలో నిద్రపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీని తర్వాత టెంకాయల వ్యాపారి తిమ్మరాజు దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. దాదాపు 50 టెంకాయలు కాలిపోయాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పారు.
నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీ
రాత్రి పూట బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ వరుసగా నాలుగు చోట్ల నిప్పు పెట్టి కలకలం రేపిన ఆకతాయి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాడు. ఫుటేజీలను పరిశీలించిన తర్వాత మణి అనే సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతనికి మతిస్థిమితం లేదని, అందుకే వరుసగా నిప్పు పెట్టుకుంటూ హల్ చేశాడని ఎస్‌ఐ యువరాజు తెలిపారు.