ఆర్భాటం ఫుల్‌.. వసతులు నిల్‌ | Publicity full.. facilties nil | Sakshi
Sakshi News home page

ఆర్భాటం ఫుల్‌.. వసతులు నిల్‌

Published Fri, Aug 12 2016 8:56 PM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

ఆర్భాటం ఫుల్‌.. వసతులు నిల్‌ - Sakshi

ఆర్భాటం ఫుల్‌.. వసతులు నిల్‌

ఇదీ పుష్కరనగర్‌లో పరిస్థితి
భక్తులకు, సిబ్బందికి సాంబారు అన్నమే..
 
గుంటూరు (నెహ్రూనగర్‌):  కృష్ణా పుష్కరాల యాత్రికుల కోసం గుంటూరు శివారులోని గోరంట్లలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్కర్‌నగర్‌లో హంగులు ఆర్భాటంగా ఉన్నా సేవల్లో మాత్రం తుస్సుమనిపించారు. వివిధ జిల్లాల నుంచి అమరావతికి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను అంగరంగ తీర్చిదిద్దారు.  వివిధ రకాల స్టాల్స్‌ను అందులో ఏర్పాటు చేశారు. మందుల షాపు, పండ్లు, పూజా సామగ్రి, కిరాణా స్టోర్స్‌ తదితరాలు ఉన్నాయి. యాత్రికులకు ఆరోగ్య పరంగా ఏమైనా సమస్యలు వస్తే వెంటనే చికిత్స చేసే నిమిత్తం వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు వినోదం నిమిత్తం విశ్రాంతి తీసుకునే రెండు షెడ్‌ల వద్ద భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో భక్తి చానల్‌ ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనా ప్రకారం దాదాపు 10 వేల మంది యాత్రికులు పుష్కర్‌ నగర్‌కు వస్తారనుకున్నారు. మొదటి రోజైన శుక్రవారం అందులో  10 శాతం మంది కూడా రాలేదు. యాత్రికులకు వినోదం కోసం డీవైఈవో రమేష్‌ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులతో కూచిపూడి, బుర్రకథ, అమ్మవారి వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 
 
విద్యార్థుల స్వచ్ఛంద సేవలు..
పుష్కర్‌నగర్‌లో యాత్రికులకు సేవలందించేందుకు చలమయ్య డీగ్రీ కళాశాల నుంచి 50 మంది, విజ్ఞాన్‌ డీగ్రీ కాళాశాల నుంచి 35 మంది విద్యార్థులు వచ్చారు. యాత్రికులకు భోజనాల వడ్డింపు, బస్సుల రూటు వివరాలు తదితరాలు తెలియజేయడంలో విద్యార్థులు సహకారం అందించారు. 
 
సాంబారు అన్నం తినలేక..
నగరపాలక సంస్థ, ఇస్కాన్‌ సంస్థ అనుబంధంగా పుష్కర యాత్రికులకు పుష్కరనగర్‌లో ఉచిత భోజన వసతి కల్పించారు. అయితే భోజనాల్లో అన్నం, సాంబారు, స్వీట్‌ పెట్టి చేతులు దూలుపుకున్నారు. సిబ్బంది సాంబారు అన్నం తినలేక అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రంగా ఉన్న దృష్ట్యా కనీసం పెరుగు, మజ్జిగ ఉన్నా బాగుండేదని పేర్కొన్నారు. యాత్రికులు చేసేది లేక సాంబరు అన్నంతోనే సరిపెట్టుకున్నారు. భోజనాల వద్ద మంచినీటి సరఫరా కూడా సరిగా లేదు. భక్తులు అన్నం ప్లేటును బెంచ్‌పై వదిలి వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
 
ఉచిత వైఫై హుళక్కే..
    పుష్కర్‌నగర్‌లో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా వైఫై అని అధికారులు  ప్రకటించినప్పటికీ, ఇక్కడ వైఫై అందుబాటులో లేదు.   ఎక్కడో సిగ్నల్‌ టవర్‌ ఉండటంతో పుష్కర్‌నగర్‌ దాకా సిగ్నల్‌ రాని పరిస్థితి. కేవలం స్టాల్స్‌ వరకు మాత్రమే వైఫై సిగ్నల్‌ అందుతున్నప్పటికీ దానికి కూడా అధికారులు పాస్‌వర్డ్‌ పెట్టారు. రెండో రోజు నుంచి యాత్రికులు పెరిగేఅవకాశం ఉండటంతో ఉండే ఫోన్‌  సిగ్నల్స్‌ కూడా అందవేమో అని కొందరు అనుకుంటున్నారు. అధికారులు సిగ్నల్స్‌ ఫ్రీక్వేన్సీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement