ఆలయంలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు
-
పవిత్రాల విసర్జన
-
చక్ర పెరుమాళ్లకు అవబృద స్నానం
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 3వ రోజు శుక్రవారం శ్రీవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలకు ధారణ చేసిన పవిత్రాలను విసర్జన చేశారు. తొలుత తెల్లవారుజామున ఆలయ అర్చకులు శ్రీవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ దంపతులతో యాగశాలలో ఘనంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీచక్ర పెరుమాళ్లను అర్చకులు మేళతాళాలతో కోనేటికి తోడ్కోని వచ్చారు. కోనేటిలో శ్రీస్వామి వారి సుదర్శన చక్ర పెరుమాళ్లకు సంప్రదాయబద్ధంగా శ్రీచక్ర స్నానం (అవబృద స్నానం) చేయించారు. అనంతరం మంగళవాయిద్యాలతో, వేదమంత్రోచ్చారణ నడుమ శ్రీవారికి శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ రమణమూర్తి, ఆలయ చైర్మన్ ఉప్పల శివరామ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి, జూనియర్ అసిస్టెంట్ కేవీఆర్ ఆంజనేయులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.