వినిపించింది లేదు.. నేర్పిందీ లేదు.. | radio teaching flop | Sakshi
Sakshi News home page

వినిపించింది లేదు.. నేర్పిందీ లేదు..

Published Sun, Dec 25 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

వినిపించింది లేదు.. నేర్పిందీ లేదు..

వినిపించింది లేదు.. నేర్పిందీ లేదు..

– అమలుకు నోచుకోని రేడియో పాఠాలు
– కొరవడిన అధికారుల పర్యవేక్షణ

అనంతపురం ఎడ్యుకేషన్‌ : నగరంలోని మొరార్జీ నగరపాలక  ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 1–5 తరగతుల విద్యార్థులు 12 మంది ఉన్నారు. ఈ నెల 19న 11.10 గంటల సమయంలో  తరగతి గదిలో ఒకేఒక్క పిల్లాడు కూర్చున్నాడు. వరండాలో నలుగురైదుగురు పిల్లలు కనిపించారు.  ఆ సమయంలో 'విందాం–నేర్చుకుందాం' అనే రేడియో ద్వారా పాఠాలు పిల్లలకు   వినిపించాల్సి ఉంది. అసలు అక్కడ రేడియోనే లేదు.  నగరంలో ఒకటి రెండు పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నా  జిల్లా వ్యాప్తంగా ఈ పథకం అమలు సక్రమంగా సాగడంలేదు.

పథకం లక్ష్యం...
పుస్తకాల్లో చూసి చదువుకోవడం కంటే కూడా వినడం ద్వారా ఏదైనా అంశాన్ని పిల్లలు  బాగా గ్రహిస్తారు. వైవిద్య బోధనతో పిల్లలకు ప్రాథమిక విద్యను గుణాత్మకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 'విందాం – నేర్చుకుందాం' రేడియో పాఠాలను ప్రసారం చేస్తోంది.   ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3–5 తరగతుల విద్యార్థుల కోసం ఈ  కార్యక్రమం చేపట్టారు. 2017 మార్చి 31 వరకు  నిర్వాహించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి ప్రారంభించారు.  కానీ ఎక్కడా అమలు కావడం లేదు.

ఇలా అమలు చేయాలి..
రోజూవారి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ షెడ్యూలు ఇవ్వాలి. 3 నుంచి 5వ తరగతి వరకు రోజూ ఓ తరగతికి ఈ కార్యక్రమం వినిపించాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 నుంచి 11.30 గంటల దాకా రేడియోలో ప్రసారమవుతుంది.   టీచరు కూడా శ్రద్ధగా రేడియో పాఠం వినాలి.  సాంకేతిక పదాలు, ముఖ్యాంశాలు, ఆసక్తికర సంభాషణలను నోట్‌బుక్కులో నమోదు చేయాలి. నమోదు చేసుకున్న సాంకేతిక పదాల అర్థాలను  పిల్లలకు వివరించాలి.
 
షెడ్యూలు అందలేదంటున్న అయ్యవార్లు
చాలా స్కూళ్లలో నేటికీ   'విందాం–నేర్చుకుందాం' అనే రేడియో కార్యక్రమం ఉందనే విషయం విద్యార్థులకు తెలీదు. ఏరోజు ఏ తరగతికి రేడియో పాఠం ఉంటుందనే షెడ్యూలు కూడా అధికారులు పంపలేదని టీచర్లు చెబుతున్నారు. దీనికితోడు సిగ్నల్‌ కారణంగా రేడియో పని చేయలేదంటూ కొందరు చెబుతున్నారు.  క్షేత్రస్థాయిలో రేడియోపాఠం అమలవుతోందా...లేదా అని అధికారులు పరిశీలించడం లేదన్న ఆరోపణలున్నాయి.
--------------------------------------
ఉత్తర్వులు పంపాం
'విందాం నేర్చుకుందాం' కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఎమ్మార్సీలకు షెడ్యూలు పంపాం. అక్కడి నుంచి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపాలని ఉత్తర్వులు ఇచ్చాం. అమలును హెచ్‌ఎంలు, టీచర్లు బాధ్యతగా తీసుకోవాలి. పీఓ, డీఈఓ దృష్టికి తీసుకెళ్లి మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్‌ స్కూళ్ల హెచ్‌ఎంలు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం.
– చెన్నకృష్ణారెడ్డి, ఏఎంఓ

Advertisement

పోల్

Advertisement