వైవీయూలో వికృత క్రీడ
వైవీయూ:
వైఎస్సార్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో వికృత క్రీడ పురివిప్పింది. గతవారంలో వర్సిటీలోని పెన్నా, చిత్రావతి మహిళా హాస్టల్స్‌లో సైన్స్ విభాగం విద్యార్థినులు కొత్తగా ప్రవేశాలు పొందిన అదే విభాగం విద్యార్థినులను ర్యాగింగ్ చేశారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పలువురు మనోవేదనకు గురయ్యారు. దీంతో శనివారం రోజున ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు పంపారు.
విచారణ చేపట్టాలని యూజీసీ నుంచి ఆదేశం
వైవీయూలో ర్యాగింగ్ జరుగుతున్న అంశంపై ఫిర్యాదును స్వీకరించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్ అధికారులు దీనిపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక పంపాలంటూ ఆదివారం మధ్యాహ్నం వర్సిటీ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. విషయ తీవ్రతను గుర్తించిన అధికారులు హుటాహుటిన చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం రాత్రి ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య గులాంతారీఖ్, సైన్స్‌విభాగాల సమన్వయకర్తలు, హాస్టల్స్ బాధ్యుడు డా. గంగిరెడ్డిల బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
కమిటీ ఏర్పాటు.. విచారణ..
అధికారులు సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. విద్యార్థినులను పిలిపించి ర్యాగింగ్ అంశంపై గోప్యంగా విచారణ చేపట్టారు. సీనియర్ విద్యార్థినులను విచారించి, మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడమని స్వీయధృవీకరణ పత్రాన్ని సైతం తీసుకున్నట్లు సమాచారం. కాగా సోమవారం సాయంత్రానికి విచారణ పూర్తిచేసిన సభ్యులు నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను మంగళవారం యూజీసీ యాంటీర్యాగింగ్‌సెల్‌కు పంపించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..
విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవు. మహిళా హాస్టల్‌లో ర్యాగింగ్ జరుగుతున్న అంశం మాదృష్టికి రావడంతో వెంటనే చర్యలు చేపట్టాం. యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులతో కలిసి రాత్రివేళ హాస్టల్స్‌ను తనిఖీ చేశాం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారించేందుకు కమిటీ వేశాం. విచారించిన తర్వాత నివేదికను యూజీసీకి పంపనున్నాం.
– ఆచార్య కె.సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్, పీజీ కళాశాల, వైవీయూ
వెంటనే చర్యలు చేపట్టాం..
విశ్వవిద్యాలయ హాస్టల్స్‌లో ర్యాగింగ్ జరుగుతున్న అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాం. రాత్రివేళ ఒక మహిళా అధ్యాపకురాలితో పాటు ముగ్గురు అధ్యాపకులు హాస్టల్స్ పర్యవేక్షణకు కేటాయించాం. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
– ఆచార్య జి. గులాంతారీఖ్, వైస్ ప్రిన్సిపాల్, చీఫ్ వార్డెన్, వైవీయూ హాస్టల్స్