అనంత: జిల్లాలో పెనుకొండ సమీపంలో రైలు ప్రమాద ఘటనతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్దరించారు. దీంతో గుంతకల్-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాందేడ్ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా జిల్లాలోని పెనుకొండ సమీపంలో ప్రమాదానికి గురికావడంతో అదే మార్గంలో వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టి రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించారు.
మడకశిర రైల్వే గేటు వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు చెందగా, 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.