
రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపానికి తీసుకుని వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై వేంచేయింపజేశారు.
ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. వేద పండితులు స్వామి వారికి వేద విన్నపాలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం అత్యంత వైభవోపేతంగా రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.