అక్రమాల అడ్డా
-
కాకినాడ పోర్టులో మితిమీరిన మాఫియా ఆగడాలు
-
అక్రమ మార్గాల్లో తరలిపోతున్న సరకు
-
దండిగా అధికారుల అండదండలు!
-
తాజాగా వెలుగుచూసిన రా షుగర్ వ్యవహారం
రోజురోజుకూ కాకినాడ పోర్టులో అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఇదంతా పోర్టు అధికారులు, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ మాఫియా వివిధ రకాల వంటనూనెల్లో కల్తీకి పాల్పడుతుండగా, మరోవైపు పోర్టులోకి వచ్చే వివిధ రకాల వస్తువులు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయి. అధికారులు మాత్రం తమకు తెలియనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
– కాకినాడ రూరల్
ఏ సరుకు ఎప్పుడు, ఏ ఓడకు వస్తుంది, వెళుతోందనే విషయాలపై అధికారులకు పక్కా సమాచారం ఉంటుంది. సరకునున అక్రమ మార్గాల్లో తరలించేందుకు వీలుగా అధికారులే మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సూర్యారావుపేట, వాకల పూడి, హార్బర్‌పేట తదితర ప్రాంతాలకు చెందినవారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో ఓ ఫ్యాక్టరీలో కల్తీ నూనెను అధికారులు సీజ్ చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. వివిధ ఫ్యాక్టరీలకు చేరాల్సిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు సరాసరి బ్లాక్‌మార్కెట్‌కు తరలించేస్తున్నా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అత్యధిక క్వాలిటీతో తయారు చేసి విదేశాలకు సరఫరా చేసే రా షుగర్‌ను కూడా అక్రమార్కులు తరలించేందుకు యత్నిస్తున్నారంటే పోర్టు ఏరియాలో మాఫియా ఆగడాలు ఏ మేరకు సాగుతున్నాయనేది అవగతమవుతోంది.
30 టన్నుల రా షుగర్ స్వాధీనం
సోమవారం కాకినాడ వాకలపూడి స్లమ్‌బర్గ్ ప్రాంతంలోను, సామర్లకోట ఉండూరులోని ఓ లేఅవుట్‌లోను అక్రమంగా నిల్వ ఉంచిన 30 టన్నుల రా షుగర్‌ను కస్టమ్స్ అధికారులు దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ రా షుగర్‌ను కాకినాడ వాకలపూడిలో ఉన్న ప్యారీ షుగర్ ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉందని, కొందరు అక్రమార్కులు ఈ షుగర్‌ను బయట ప్రాంతాలకు తరలించి అక్రమంగా అమ్ముకుంటున్నారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ రా షుగర్‌ను మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వినియోగించే పరిస్థితులు లేవు. దీనిని విదేశాల్లో కిలో ఒక్కంటికి రూ.450 చొప్పున అమ్ముతారని, దీనికి ఇంత రేటు ఎందుకో తెలియదని, అసలు దీనిని ఎందుకు వినియోగిస్తారో కూడా తెలియదని అధికారులు, స్థానికంగా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు చెబుతున్నారు. అధికారులు దాడిచేసి పట్టుకున్న షుగర్‌ను రెండు లారీల్లో కాకినాడలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. అధికారులు ఈ వివరాలను చెప్పేందుకు నిరాకరించారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం వివరాలేమీ తాము చెప్పలేమని పేర్కొన్నారు. దీనిని ఓడ నుంచి తరలించారా లేదా ప్యారీ షుగర్ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత తరలించారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు. కాకినాడ పోర్టు తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రా షుగర్‌ను అక్రమార్కులు దేనికి వినియోగిస్తున్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనే విషయాలపై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రా షుగర్ విలువ దాదాపు రూ.1.35 కోట్లు ఉంటుం దని అంచనా వేస్తున్నారు. రెండు లారీలను కూడా అధికారులు సీజ్ చేసినట్టు సమాచా రం. కస్టమ్స్ డీసీ వై.భాస్కరరావు ఆధ్వర్యం లో అధికారుల బృందం దాడులు నిర్వహిం చింది. దర్యాప్తు పూర్తయితేనే కానీ సమాచా రం చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.