రచ్చకెక్కిన ఉద్యోగుల గొడవ
-
విచారణ చేపట్టిన ఆర్డీవో
-
ఇద్దరూ ఉద్యోగుల పై బదిలీ వేటు..?
వేములవాడ రూరల్ : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించింది. పరస్పరం దూషించుకోవడం తారస్థాయికి చేరింది. సమాచారం అందుకున్న సిరిసిల్ల ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్ ఘటనపై విచారణ చేపట్టారు. వివరాలు.. తహసీల్దార్‌కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గంగాధర్, వీఆర్వో రాజయ్యకు మధ్య శనివారం ఓ విషయంలో గొడవ జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. ఆర్డీవో సోమవారం విచారణ చేపట్టారు. గొడవకు కారణమైన అంశాలపై ఇద్దరి నుంచి లిఖితపూర్వకం పత్రాలు స్వీకరించారు. వీఆర్వోలు, ఆర్‌ఐల నుంచి సైతం సమాచారం సేకరించారు. ‘అవినీతి’ ప్రక్రియ ఉద్యోగుల మధ్య గొడవకు దారితీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. డెప్యూటీ తహసీల్దార్ సాక్షిగా ఇద్దరు ఉద్యోగులు గొడవ పడ్డ తీరు కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గొడవతో రచ్చకెక్కిన ఈ ఇద్దరు ఉద్యోగులపై బదిలీ వేటు పడనున్నట్లు తెలిసింది. కొన్నేల్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న వీరిద్దరూ లావాదేవీల్లో ఏర్పడ్డ విభేదాలతోనే గొడవకు దిగినట్లు సమాచారం. ఈవిషయంపై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన ఓ సమావేశంలో ఉన్నట్లు తెలిసింది.