విచారణ చేపడుతున్నఆర్డీఓ గోవిందరావు
సాలూరు : మండలంలోని శివరాంపురం గ్రామ సహాయకుడు(తలయారీ) ప్రభుత్వం భూమిని అమ్మేసుకున్నాడని లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో తలయారీ, గ్రామస్తులతో మాట్లాడారు. తలయారీ వెలగాడ సింహాచలం 1984లో ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మేశాడని అదే గ్రామానికి చెందిన వెలగాడ సుందరరావు అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీఓ విచారణ జరిపారు. అయితే తాను ఉద్యోగంలో చేరింది 1985లోనని తన తాతల నుంచి సంక్రమించినట్టుగా క్రయపత్రాలున్నాయని, వాటి ఆధారంగా భూమిని అమ్మానని సింహాచలం చెబుతున్నాడు. విచారణ అంశాలను లోకాయుక్తకు పంపనున్నట్లు ఆర్డీఓ తెలిపారు.