ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు
Published Tue, Apr 11 2017 11:31 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఆమోదించే విషయంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతుల ఆమోదానికి సంబంధించి నిర్వహించిన జిల్లాస్థాయి పర్యావరణ ఇన్‌ఫాక్ట్ అసైన్‌మెంట్ అథారిటీ, జిల్లాస్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఆచంట మండలం కోడేరులో 4.99 హెక్టార్ల పరిధిలో, పెరవలి మండలం ఖండవల్లిలో 1.8 హెక్టార్లలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు సంబంధించి మార్చి 31 వరకూ ఉన్న పర్యావరణ అనుమతులను ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఆచంట మండలం ముత్యాలవారిపాలెం 1.45 హెక్టార్లలో, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, బల్లిపాడు పరిధిలో 2.16 హెక్టార్లకు సంబంధించి ఇసుక రీచ్‌ల నిర్వహణకు సమావేశం పర్యావరణ అనుమతులను ఆమోదించింది. ఆయా ఇసుక రీచ్‌లను ప్రభుత్వ నిబంధనల మేరకే పర్యావరణామోదం ఇవ్వాలే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ విభజించవద్దని గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో జి.చక్రధరరావు పాల్గొన్నారు.
Advertisement