వీసీలో మాట్లాడుతున్న అటవీశాఖ ముఖ్య కార్యదర్శి మీనా
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి మీనా అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పీసీ సీఎఫ్ పీకే ఝాతో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలు, ఇప్పటివరకు నాటిన మొక్కలు, మొక్కల సైజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు గట్లపై ఈత మొక్కలు నాటాలని సూచించారు. ఈ వీసికి సోషల్ ఫారెస్టు డిఎఫ్‌ఓ రాంమూర్తి, ఎక్సైజ్ ఈఎస్ నర్సింహారెడ్డి, చిన్ననీటి పారుదల ఎస్‌ఈ సదాశివ హాజరయ్యారు.