15 నుంచి 5కు తగ్గనున్న కార్యాలయాలు
అగమ్యగోచరంలో 450 కుటుంబాలు
‘ప్రైవేటు’గా రిజిస్ట్రార్ కార్యాలయ పనులు!
అయినవారికి కట్టబెట్టేందుకు టీడీపీ నేతల సన్నాహాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ శాఖపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ శాఖ పనులన్నీ తమకు అనుకూలమైన ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్ సంస్థకు కట్టబెట్టెందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ సంస్థ సూచనల మేరకు జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 5కు కుదించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కంప్యూటీరీకరణ చేస్తున్నామంటూ బయటకు ప్రచారం చేస్తూనే పనులన్నీ సంస్థకు అప్పగించి నెలనెలా ముడుపులు అందుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. నేతల ధన దాహానికి జిల్లాలోని వందలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్ల ఉన్నాయి. వీటిలో ఒక్కో డివిజన్‌లో ఐదేసి చొప్పున రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని కార్యాలయాల నుంచి ఆదాయం అధికంగానే వస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కరే డీఐజీగా పని చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. కొత్తగా రిజిస్ట్రార్ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కార్పొరేట్ సంస్థ సూచనల మేరకు కార్యాలయాలను ఐదుకు తగ్గించి శ్రీకాకుళం డివిజన్‌లో రెండు, టెక్కలిలో ఒకటి, పాలకొండలో ఒకటి, ఇచ్ఛాపురంలో ఒకటి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రైవేటు’ వ్యక్తుల ఆదాయార్జనకే కార్యాలయాలన్నీ ఒక చోటకు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకం..
ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స»Œ æరిజిస్ట్రార్‌తో పాటు మరో 6 నుంచి 8 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అంతే కాకుండా జిల్లా కేంద్రం రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఎస్టాబ్లిస్‌మెంట్ సిబ్బంది, వీరితో ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 20 మందికి పైమాటే. కార్యాలయాలు కుదిస్తే ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించిన ప్రైవేటు కంపెనీకి సంబంధించిన వ్యక్తులను నియమిస్తారని బోగట్టా.
అందోళనలో డాక్యుమెంట రైటర్లు
గత కొన్నేళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటీకరణ, కార్యాలయాల కుదింపును వ్యతిరేకిస్తున్నారు. ఉపాధి కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 450 కుటుంబాలకు పైబడి ఈ వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని, నోటికాడ కూడు తీసేయొద్దంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఉసురు తీయొద్దు..
టీడీపీ ప్రభుత్వం అధికారంలొకి వచ్చాక ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఉద్యోగులను ఊడదీయడం సరికాదు. నిరుద్యోగుల ఉసురు తీయొద్దు. ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. రిజిస్ట్రార్ కార్యాలయాలను కుదించి రైటర్ల బతుకులు రోడ్డున పడేయకండి. మాతో పాటు మా మీద ఆధారపడి బతుకుతున్న వారంతా నాశనమయిపోతారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వండి. అందరినీ తొలగించి ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు కట్టబెట్టడం సరికాదు. రైటర్ల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం విరమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
–బలగ పెంటయ్య, దస్తావేజు లేఖరుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఆదేశాలు రాలేదు...
జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను బ్యాక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ విధానంలో కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారికంగా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే తప్ప స్పష్టత రాదు.
– కె.నాగమణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్