తూర్పుగోదావరి(రాజమండ్రి సిటీ) : రిజర్వేషన్లు ఏ ఒక్క వర్గం సొత్తూ కాదని, అందరికీ సమన్యాయం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణాలుగా పిలుస్తున్న ఓసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి విమర్శించారు. తక్షణమే రాజ్యాంగసవరణ ద్వారా ఓసీలకు అవకాశాలు కల్పించాలని, ఓసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే గుజ్జర్లు, పటేళ్ల తరహాలో పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరించారు. పదేళ్లుగా అగ్రవర్ణ పేదలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది అగ్రవర్ణపేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని అనేక కమిటీలు చెప్పినా ప్రభుత్వాలు ఆమోదించడం లేదన్నారు. తక్షణమే దాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సామాజిక వివక్ష అంతరించిందని, అదే సమయంలో ఆర్థిక వివక్ష పెరిగి అగ్రవర్ణాల వారనే నెపంతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు రాజకీయనాయకులు అగ్రవర్ణాల వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్తించడం బాధాకరమన్నారు. ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తే ఆర్థిక అసమానతలు తొలగి రిజర్వేషన్లపై ఉద్యమాలు తగ్గుతాయన్నారు.
రిజర్వేషన్లు ఏ ఒక్కరి సొత్తూ కాదు
Published Sun, Sep 20 2015 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement