g karunakarreddy
-
‘పంచాయతీ’పై రాద్ధాంతం ఎందుకు?: కరుణాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లున్నాయని, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరగకుండా ఓసీలు అత్యధిక జనాభా ఉన్న గ్రామాలను ఇతర వర్గాలకు కేటాయించకుండా జనరల్ స్థానాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, విశ్వేశ్వర్, ప్రవీణ్ కుమార్, విజయానంద్ పాల్గొన్నారు -
‘రెడ్డి నేతలను అణచివేసేందుకు కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గ నేతలను అణచి వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారనే కోపంతో పార్టీలు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాయని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, ప్రతాప్రెడ్డిలపై కేసులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇప్పటివరకు టికెట్ హామీ లభించకపోవడం శోచనీయమన్నారు. మహాకూటమి అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా రెడ్డి నేతను ప్రకటించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఓసీ సమస్యలను అన్ని పార్టీలు తమ ఎన్నిక ప్రణాళికలో చేర్చి ప్రధాన ఎజెండాగా పరిగణించడం హర్షణీయమని ఆయన తెలిపారు. -
3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన
సాక్షి, హైదరాబాద్: రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా జూన్ 3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సింహగర్జన పోస్టర్లను ఆయ న విడుదల చేశారు. తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించే సభకు దేశంలోని రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గంలో 3 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో అధిక శాతం పేదరికంతో బాధపడుతున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో రూ.1,000 కోట్లు, జాతీయ స్థాయిలో రూ.10 వేల కోట్లతో జాతీయ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేజర్ జనరల్ సిన్హా కమిటీ రెడ్డి సామాజిక వర్గంలో అధిక శాతం వెనకబడి ఉన్నారని, వీరిని ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కమిటీ నివేదికను పార్లమెంట్లో చర్చించి ఆమోదించాలన్నారు. కార్యక్రమంలో బసిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి, విరాణిరెడ్డి, రవీందర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, సూర్యకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఏ ఒక్కరి సొత్తూ కాదు
తూర్పుగోదావరి(రాజమండ్రి సిటీ) : రిజర్వేషన్లు ఏ ఒక్క వర్గం సొత్తూ కాదని, అందరికీ సమన్యాయం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణాలుగా పిలుస్తున్న ఓసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి విమర్శించారు. తక్షణమే రాజ్యాంగసవరణ ద్వారా ఓసీలకు అవకాశాలు కల్పించాలని, ఓసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే గుజ్జర్లు, పటేళ్ల తరహాలో పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరించారు. పదేళ్లుగా అగ్రవర్ణ పేదలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది అగ్రవర్ణపేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని అనేక కమిటీలు చెప్పినా ప్రభుత్వాలు ఆమోదించడం లేదన్నారు. తక్షణమే దాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సామాజిక వివక్ష అంతరించిందని, అదే సమయంలో ఆర్థిక వివక్ష పెరిగి అగ్రవర్ణాల వారనే నెపంతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు రాజకీయనాయకులు అగ్రవర్ణాల వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్తించడం బాధాకరమన్నారు. ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తే ఆర్థిక అసమానతలు తొలగి రిజర్వేషన్లపై ఉద్యమాలు తగ్గుతాయన్నారు.