సూపర్ మార్కెట్లుగా చౌక డిపోలు
సూపర్ మార్కెట్లుగా చౌక డిపోలు
Published Wed, Nov 23 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి వినియోగదారులకు రేషన్‌తో పాటు కిరాణా సరుకులనూ వచ్చేనెల 1 నుంచి అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని వర్తక సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెద్దనోట్లు రద్దువల్ల సామాన్యులు చిల్లర కొరతతో ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఉప్పు వంటి సరుకులను ఒక్కో కార్డుకు కిలో చొప్పున అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు కిరాణా వ్యాపారులు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. నిర్ణయించిన ధరల ఫ్లెక్సీలను రేషన్ దుకాణాల వద్ద ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఎస్‌వో శివశంకరరెడ్డి, ఎం.గణపతిరావు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement