jc told
-
సూపర్ మార్కెట్లుగా చౌక డిపోలు
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి వినియోగదారులకు రేషన్‌తో పాటు కిరాణా సరుకులనూ వచ్చేనెల 1 నుంచి అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో జిల్లాలోని వర్తక సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెద్దనోట్లు రద్దువల్ల సామాన్యులు చిల్లర కొరతతో ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఉప్పు వంటి సరుకులను ఒక్కో కార్డుకు కిలో చొప్పున అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు కిరాణా వ్యాపారులు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. నిర్ణయించిన ధరల ఫ్లెక్సీలను రేషన్ దుకాణాల వద్ద ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఎస్వో శివశంకరరెడ్డి, ఎం.గణపతిరావు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం
ఏలూరు: రూ..5కోట్ల వ్యయంతో జిల్లాలోని కొవ్వలిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున అధిక దిగుబడి సాధించే చేపల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాలు అభివృద్ధి తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మపుత్ర నదిలో మేలుజాతి చేపపిల్లలను సేకరించి జాతీయ స్థాయి ప్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సంస్థ సాంకేతిక సలహాలతో జన్యుపరంగా ఎటువంటి వైరస్ లేని మత్స్య సంపదను జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు దెందులూరు మండలం కొవ్వలిలో 23 ఎకరాల విస్తీర్ణంవలో ఆడ, మగ చేపలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఈ చేపల సంతతిని జిల్లాలోని రైతులకే కాకుండా ఇతర జిల్లాల రైతులకు కూడా సరఫరా చేసే స్థాయి కొవ్వలి చేపల పిల్లల కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. చేపల చెరువుల్లో నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు నిర్వహిచేందుకు ప్రతేయక మొబైల్ లాబ్‌లు కూడా ఏరాపటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఉద్యానవన శాఖ పరిధిలో 1.20లక్షల ఎకరాల వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉండగా ఇంత వరకూ 1.12 లక్షల ఎకరాలు పూర్తయిందనీ, మిగిలిన రెండు వేల ఎకరాల వివరాలు రెండురోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని, భవిష్యత్‌లో కొత్తగా ఉద్యానవన పంటలు వేసేవారి వివరాలను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయాలని కలెక్టర్ చెప్పారు. మండలానికి ఒక రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే మార్కెటింగ్ శాఖ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని కలెక్టర్ ప్రశ్నించారు. రైతుల వద్ద నుండి సేకరించిన పాలకు ఏరోజుకారోజే ఆన్లైన్ రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, సిపిఒ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయిలక్ష్మీశ్వరి, మత్స్యశాఖ డిడి యాకోబ్భాషా, మార్కెటింగ్‌శాఖ ఎడి కె.ఛాయాదేవి, మైక్రో ఇరిగేషన్ పిడి రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 95 శాతం సెటాప్ బాక్స్‌ల ఏర్పాటు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో 95 శాతం వరకూ సెటాప్ బాక్స్‌లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఎస్ఒలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఫోర్త్ ఫేజ్‌లో 95శాతం సెటప్ బాక్స్‌లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబరు 31వ తేదీనాటికి నూరు శాతం మంతి పూర్తి చేసుకుంటారని చెప్పారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడానికి 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువారం వెలుగు మహిళా గ్రూపులు, సహకార సొసైటీ సభ్యులకు 2015–16 ఆర్థిక సంవత్సరంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సును ఆయన నిర్వహించారు. జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్ పంట కాలంలో దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు. కామన్ రకం ధాన్యానికి రూ.1,470, గ్రేడ్–ఎ రకం ధాన్యానికి రూ.1,530 కనీస మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని ఈ మేరకు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఏటా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం వల్ల రూ.74 కోట్లు కమీషన్ రూపంలో వెలుగు సహకార సంఘాలకు చేరుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి వెలుగు సంఘాల్లో పోటీతత్వం కూడా పెరుగుతోందని, మధ్య దళారీల బెడద లేకుండా రైతులకు నేరుగా గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రధానోద్దేశమని చెప్పారు. డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.గణపతిరావు, సహకార శాఖాధికారి ప్రసాద్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు. -
సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని లైసెన్స్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనికోసంS నవంబరు 5లోగా కలెక్టరేట్లోని జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సర్వేయర్ల అవసరం ఎంతో ఉన్నదని, లైసెన్స్ ఉన్న సర్వేయర్లకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఐటీఐ, సివిల్ డ్రాఫ్ట్్సమెన్, డిప్లమో సివిల్, నాలుగు నెలల సర్వే శిక్షణ పొందిన వారు, ఇంటర్ ఓకేషినల్ కోర్సు చేసిన అభ్యర్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారైతే రూ.1500, ఇతర కులాల వారు అయితే రూ.3 వేలు చొప్పున వైస్ ప్రిన్సిపల్, సర్వే ట్రైనింగ్ అకాడమీ, ఏపీ హైదరాబాద్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్లు జతపరిచి కలెక్టరేట్లోని ఏడీ సర్వే కార్యాలయంలో అందజేయాలని జేసీ సూచించారు. -
సెటాప్ బాక్సులు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు వీక్షించే వినియోగదారులంతా డిసెంబరు 31లోగా సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని, సెటాప్ బాక్స్‌లు లేని వారు జనవరి 1 నుంచి టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశం ఏ మాత్రం ఉండబోదని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఎస్‌వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన టీవీ ప్రసారాలు అందించే ఉద్దేశంతో టీవీ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతోందని ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరూ సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. 95 శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబర్ 31 నాటికి నూరు శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుని టీవీ ప్రసారాలు అంతరాయం లేకుండా వీక్షించాలని కోరారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు చేయాలని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ రేడియో ఇంజనీర్ అప్పారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, ఎంఎస్ఓలు రామకృష్ణ, రామచంద్రరావు, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.