ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Published Fri, Oct 28 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
ఏలూరు సిటీ : జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడానికి 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువారం వెలుగు మహిళా గ్రూపులు, సహకార సొసైటీ సభ్యులకు 2015–16 ఆర్థిక సంవత్సరంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సును ఆయన నిర్వహించారు. జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్ పంట కాలంలో దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు. కామన్ రకం ధాన్యానికి రూ.1,470, గ్రేడ్–ఎ రకం ధాన్యానికి రూ.1,530 కనీస మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని ఈ మేరకు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఏటా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం వల్ల రూ.74 కోట్లు కమీషన్ రూపంలో వెలుగు సహకార సంఘాలకు చేరుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి వెలుగు సంఘాల్లో పోటీతత్వం కూడా పెరుగుతోందని, మధ్య దళారీల బెడద లేకుండా రైతులకు నేరుగా గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రధానోద్దేశమని చెప్పారు. డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.గణపతిరావు, సహకార శాఖాధికారి ప్రసాద్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు.
Advertisement