వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
Published Fri, Mar 24 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
ఏలూరు సిటీ : పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక ధృక్పథాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు రాసే సమయంలో వార్తకు సంబంధించిన విషయంపై పూర్తి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత్రికేయులు వృత్తి ప్రమాణాలు, విలువలు పాటించాలని కోరారు. మాతృభాషతో పాటు ఆంగ్లంపై కూడా కొంత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రెస్ అకాడమీ హైదరాబాద్‌లో కొనసాగుతుందని త్వరలో అమరావతి రాజధానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిర్భయంగా వార్తలు రాయాలని, ఏది రాయకూడదో విలేకరులు తెలుసుకోవాలన్నారు. డెవలప్‌మెంట్ జర్నలిజంపై ఆయన మాట్లాడుతూ డెవలప్‌మెంట్ జర్నలిజం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూపిస్తూ వార్తలను రాయడం ఒక్కటే కాదని అలాంటివార్తలతో పాటు ప్రత్యేకమైన లక్ష్యంతో వార్తలు రాసి ప్రజోపయోగమైన అభివృద్ధి తీసుకురావాలన్నారు. 13 జిల్లాల్లో పాత్రికేయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి డి.శ్రీనివాసులు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం ఉన్నారు.
ప్రెస్ ఆకాడమీ చైర్మన్ కలిసిన ఏపీజేఎఫ్ నాయకులు
ఏపీ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ వి.వాసుదేవ దీక్షితులను స్థానిక జెడ్పీ అతిథిగృహంలో ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.సీతారామరాజు ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో ప్రెస్ అకాడమీకి సకల సౌకర్యాలతో భవనాన్ని సిద్ధం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని దీక్షితులు చెప్పారు. ఈ సందర్భంగా దీక్షితులను సంఘ జిల్లా అధ్యక్షుడు సీతారామరాజు సత్కరించారు. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ ఏలూరు శాఖ అధ్యక్షుడు వి.మధుసూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎస్.సంజయ్‌కుమార్, కోశాధికారి ఉర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement