కుంభకోణాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు
కుంభకోణాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు
Published Thu, Mar 9 2017 9:56 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని కామవరపకోట కేంద్రంగా అధికార పార్టీ నేతలు మొక్కలు పాతకుండానే, వేసినట్టు చూపి రూ. 3 కోట్ల వరకు అక్రమానికి పాల్పడిన వైనంపై గత నెలలో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ మరోమారు స్పందించారు. ఇటీవల ఉద్యానవన శాఖలో జరిగిన కుంభకోణంపై కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ భాస్కర్ స్పందిస్తూ ప్రభుత్వ నిధులు స్వాహా చేసినా, కుంభకోణాలకు పాల్పడినా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని ఆయన స్పష్టం చేశారు. కుంభకోణాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఉద్యానవన శాఖకు రూ.32 కోట్లు నిధులు కేటాయిస్తే రూ.13 కోట్లు నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టారని, చేసిన ఖర్చుల్లో కూడా పంటలు లేకపోయినా, ఉన్నట్లు రికార్డులు చూపించి కామవరపుకోట మండలంలో ఉద్యానవనశాఖ అధికారులు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని దోషులు ఏ స్థాయిలో ఉన్నా జైలుకు పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులకు చెందాల్సిన సబ్సిడీ సొమ్మును దళారుల చేతుల్లోకి మళ్లిస్తే సహించబోమని కలెక్టర్ చెప్పారు. ప్రతివారం పలు శాఖల ప్రగతి తీరును సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 32 కోట్లు బడ్జెట్ కేటాయించగా గురువారం నాటికి రూ. 13 కోట్లు ఖర్చు చేయలేమంటూ నిధులను ఎందుకు మురగబెట్టారని కలెక్టర్ ప్రశ్నించారు. నిధులు మురుగుపోకుండా ఉద్యానవనశాఖ కమిషనర్‌తో కలెక్టర్ ఫోన్‌లో చర్చించి రాబోయే 20 రోజుల్లో కనీసం రూ. 4 కోట్లు నిధుల వినియోగం జరిగేలా తగిన అనుమతులు ఇచ్చామన్నారు. 500 ఎకరాల్లో మల్బరీ తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించగా 370 ఎకరాలు మాత్రమే పూర్తి చేసి చేతులెత్తేసిన సెరీకల్చర్ డీడీని సెలవుపై వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సకాలంలో అందించడానికి ప్రయత్నించి రైతుల అభిమానాన్ని పొందాలే తప్ప ఏ రైతు లంచం ఇస్తాడు ? ఆ సొమ్ము తీసుకుంటామా? అనే ఆలోచన వదిలిపెట్టి నిజమైన పేద రైతులకు లబ్ది చేకూర్చాలని ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ ఎంహెచ్. షరీఫ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement