ప్రతి పాఠశాలకూ వంట షెడ్లు
ప్రతి పాఠశాలకూ వంట షెడ్లు
Published Thu, May 11 2017 11:45 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేపట్టే 1,559 సివిల్ పనులకు రూ.85.96 కోట్లతో అంచనాలు తయారు చేయాలని విద్యాశాఖాధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు ప్రగతిని కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. రూ.19 కోట్లతో 900 పాఠశాలల్లో వంటషెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, దీంతో ప్రతి పాఠశాలకూ వంట షెడ్లు సమకూరుతాయని కలెక్టర్ చెప్పారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించే నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్స్ సిద్ధం చేయాలని, తాగునీటి సౌకర్యం 100 శాతం పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఎక్కువ పర్సంటేజీలు, ర్యాంకులు రావడం ముఖ్యం కాదని, పిల్లల్లో నీతి నిజాయితీ, కష్టపడి చదివి అత్యధిక మార్కులు సాధించాలన్నదే ముఖ్యమన్నారు. సమావేశంలో డీఈవో ఆర్.గంగాభవాని, సర్వశిక్షా అభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి, డెప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.
ఆప్కో ద్వారా కుట్టింపు వద్దు : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల యూనిఫారం ఆప్కో ద్వారా కుట్టించే పద్ధతి వద్దని, క్లాత్ సమకూరిస్తే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో యూనిఫాం కుట్టించుకోవడానికి అవసరమైన క్లాత్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్‌ను కలెక్టర్ కోరారు.
Advertisement