షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలి
షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలి
Published Thu, May 25 2017 12:01 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఐదు వేల హెక్టార్లలో కూరగాయల పెంపకానికి షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వెయ్యి హెక్టార్లలో శాశ్వత పెండాల్స్‌లో కూరగాయల పెంపకం ప్రస్తుతం సాగుతోందని, దీనికి అదనంగా మరో 5 వేల హెక్టార్లలో షేడ్‌నెట్స్ పరిధిలో కూరగాయలు, పువ్వుల పెంపకాన్ని ప్రొత్సహించాలని సూచించారు. కూరగాయల ప్రాసెసింగ్, ప్యాకింగ్, గ్రేడింగ్‌లకు ప్రాధాన్యతిస్తే రైతుకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రాబోయే రెండేళ్లలో జిల్లాలో ప్రతి రైతుకు అవసరమైన ప్లాస్టిక్ ట్రేలు సమకూర్చాలన్నారు. మార్కెట్‌లో కూరగాయల ధరలు కిలో రూ.20 పలుకుతుంటే రైతువద్ద కేవలం రూ.3లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. జిల్లాలో అంతరపంటగా కోకోను ప్రొత్సహించాలని, 1,800 హెక్టార్ల విస్తీర్ణంలో కోకో నర్సరీని పెంచేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మూడేళ్లలో 9 లక్షల మొక్కలు రైతులకు అందుబాటులో వచ్చే విధంగా చూడాలన్నారు. చేపల చెరువులకు అనుమతులు తీసుకుని రొయ్యలు సాగుచేయడం వల్ల డెల్టా అంతా కాలుష్యకోరల్లో చిక్కుకుందన్నారు. ఈ పరిస్థితి తొలగించాలంటే చేపల పెంపకంలో జోన్‌వారీ విధానాన్ని అమలు చేయాలన్నారు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, సీపీఓ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి పాల్గొన్నారు.
వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయండి
ఏలూరు (మెట్రో) : వర్షాకాలం సీజన్ రాకముందే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టరు సంబంధితాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రానున్న వర్షాకాలం సీజన్‌కు ముందే జిల్లాలో సీసీరోడ్లు, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు పనులు చేపట్టేందుకు ఇసుక సిద్ధం చేసుకోవాలని, అవసరమైతే పర్మిషన్ మంజూరు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మాణ పనులపై అలసత్వం వహించిన అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. అక్టోబరులో మంజూరైన పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ఇప్పటివరకూ ప్రారంభించకపోవడంపై ప్రశ్నించారు. వచ్చేవారానికి పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ ఈఈ మాణిక్యం, డీపీఓ సుధాకర్‌ను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో మూడు, భీమడోలు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయితీలో గ్రామంలో ఒక పంచాయతీ బిల్డింగు నిర్మాణం ప్రారంభం కాకపోవడంపై సంబంధిత ఎంపీడీఓలతో ఫోన్‌లో సమీక్షించి 24 గంటల్లో నిర్మాణం ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇంకా పలు గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు ఏఈలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీరోడ్డు లెవెల్స్ చూసుకుని డ్రైయిన్‌నిర్మాణాలు చేపట్టాలన్నారు. డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement