సెటాప్ బాక్సులు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు వీక్షించే వినియోగదారులంతా డిసెంబరు 31లోగా సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని, సెటాప్ బాక్స్‌లు లేని వారు జనవరి 1 నుంచి టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశం ఏ మాత్రం ఉండబోదని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎంఎస్‌వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన టీవీ ప్రసారాలు అందించే ఉద్దేశంతో టీవీ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతోందని ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరూ సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
95 శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబర్ 31 నాటికి నూరు శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుని టీవీ ప్రసారాలు అంతరాయం లేకుండా వీక్షించాలని కోరారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు చేయాలని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ రేడియో ఇంజనీర్ అప్పారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, ఎంఎస్‌ఓలు రామకృష్ణ, రామచంద్రరావు, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.