బావిస్ ఖానాపూల్ వద్ద వరద ఉధృతిని చూస్తున్న మంత్రి
క్షేత్రస్థాయిలో మంత్రి హరీశ్‌రావు పరిశీలన
యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు
రెండోరోజు సిద్దిపేటలో బిజీబిజీ
సిద్దిపేట జోన్: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు పోటెత్తుతున్న క్రమంలో సహాయక చర్యలను వేగవంతం చేసే దిశగా రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు రెండవ రోజు ఆదివారం సిద్దిపేటలో బిజీబీజీగా గడిపారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ అప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేసే దిశగా అధికార యంత్రాంగానికి సూచనలు, ఉన్నతాధికారులకు ఆదేశాలను ఇస్తూ వరద ప్రవాహంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పటిష్ట చర్యలను చేపట్టారు.
ముందుగా స్థానిక కోమటి చెరువును మంత్రి సందర్శించి అక్కడ చెరువు నుంచి 24 గంటలుగా ప్రవహిస్తున్న వరదనీటి మత్తడి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ భాగం నుంచి వరదనీరు కోమటి చెరువులోకి పెద్ద ఎత్తున చెరుకోవడంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువ భాగంలోని నర్సాపూర్, రాజగోపాల్‌పేట చెరువులకు మత్తడి రూపంలో మళ్లించారు. ఈ ప్రక్రియను మంత్రి నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కోమటి చెరువు వద్ద ఆరా తీశారు.
ఒక దశలో చెరువు కట్టకు ఒక పక్క కోత ఏర్పడిన క్రమంలో మంత్రి దగ్గరుండి సుమారు వెయ్యి ఇసుక బస్తాలతో మరమ్మతు పనులు వేగవంతం చేశారు. అనంతరం కోమటి చెరువు ఫీడర్ చానల్ ప్రవాహం వెంట అధికార యంత్రాంగంతో పరిశీలించారు. పట్టణంలోని హైదరాబాద్ బ్రిడ్జిని సందర్శించి అక్కడ నిలిచిన వరద నీటిని మళ్లించే చర్యలను వేగవంతం చేస్తూ స్థానికులకు ఇబ్బంది కలుగకుండా బావిస్‌ఖానా పూల్ గేట్లను ఎత్తివేయించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, తీవ్ర నీటి ఉధృతిపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆరా తీశారు.
ప్రజలతో మమేకమై ....
కోమటి చెరువు మత్తడి ప్రవాహాన్ని రెండవ రోజు మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తున్న క్రమంలో చెరువు కట్టపై పెద్ద ఎత్తున చేరిన ప్రజలతో ఆయన మమేకమై అప్యాయంగా పలకరించారు. దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట కోమటి చెరువు మత్తడి పారడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రితో ఆనందాన్ని పంచుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు చెరువు వద్దకు చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో చెరువును పర్యాటక క్షేత్రంగా మార్చే క్రమంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.నీటి ప్రవాహాన్ని, చెరువును తిలకించడానికి వచ్చిన చిన్న, పెద్ద తేడా లేకుండా మంత్రి హరీశ్‌రావు చెరువు మత్తిడిపై వారి మనోభిప్రాయాలు తెలుసుకున్నారు.
మంత్రి వెంట నీటి పారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ షేక్‌లాల్ ఆహ్మద్ , మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, లోక లక్ష్మిరాజం, పాలసాయిరాం, బ్రహ్మం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.