ఐసీఐసీఐ బ్యాంకు అధికారితో మాట్లాడుతున్న ఎస్సై దీపక్
♦ ‘నకిలీ పట్టా పాసుపుస్తకాల వ్యవహారంలో అనుమానాలు
♦ నగరంలోని బ్యాంకుల్లో పోలీసుల సోదాలు
సంగెం(పరకాల) :
నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో బ్యాంకు, రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పాసుపుస్తకాల కేసులో ప్రధాన నిందితుడు బిచ్చా దొరికితే ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందో వెల్లడయ్యే అవకాశముంది. కాగా బుధవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం ఎస్సై.. వరంగల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ చేపట్టారు. సంగెం, నెక్కొండ మండలాల నుంచి రుణాల కోసం సుమారు 20కి పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో గుగులోత్ తారాచంద్(ఎల్గూర్ స్టేషన్), ధరావత్ రాంజీ, బానోత్ సరోజన(తీగరాజుపల్లి), లావుడ్యా వినోద (చంద్రుగొండ), ధరావత్ రాజు, ధరావత్ సురేష్, భూక్యా రేణుక(బంజరపల్లి)ల దరఖాస్తులను నకిలీవని గుర్తించి తిర స్కరించామని బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు ఎస్సై దీపక్ తెలిపారు. మిగిలినవి నకలీవని చెప్పలేమని వారు చెప్పినట్లు ఎస్సై దీపక్ తెలిపారు.
అధికారులకు వాటాలు?
ఈ ‘నకిలీ’ వ్యవహారం తెలిసి కూడా బ్యాంకు అధికారులు.. నిందితులతో కుమ్మక్కై తమ వాటాగా 15 శాతం తీసుకుని రుణాలు మం జూరు చేసినట్లు తెలుస్తోంది. సంగెం సొసైటీ, ఆంధ్రా బ్యాంకుతో పాటు గీసుకొండ మండలం ఊకల్‌లోని కార్పొరేషన్ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తెలిసంది. నిందితుడు బిచ్చా.. పాసుపుస్తకాలు తయారు చేసి ఎకరాకు రూ.10వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే, బ్యాంకుల వద్ద కొందరు ఏజెంట్లుగా వ్యవహరించి రుణాలు ఇప్పించారని, అందులో 15 శాతం అధికారులకు, 15 శాతం ఏజెంట్లు వసూలు చేయగా మిగిలిన మొత్తం సంబంధిత రైతులకు ఇచ్చేవారని సమాచారం.
కాగా నిజమైన రైతులు వెళ్లి రుణం కావాలని బ్యాంకు అధికారులను అడిగితే ఎన్నో కొర్రీలు పెట్టే బ్యాంకు అధికా>రులు.. అక్రమార్కులతో చేతులు కలిపి అడ్డగోలుగా రుణాలు మంజూరు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా నిందితుడి ఇంటిలో భారీ మొత్తంలో ఖాళీ పాసుపుస్తకాలు లభించడంతో రెవెన్యూ శాఖ లోని సిబ్బంది హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పాసుపుస్తకాలు సైతం నకిలివా లేదా కార్యాలయం నుంచే నిందితుడికి అందాయా అని చర్చించుకుంటున్నారు.
నిందితుడు చదివింది పదో తరగతే..
వీఆర్‌ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, సబ్‌రిజిస్టార్ల సంతకాలను ఫోర్జరీ చేసిన నిందితుడు బిచ్చా చదివింది కేవలం పదో తరగతే. నకిలీ పాసుపుస్తకాల తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే నిందితుడికి కొందరు విద్యావంతులు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సహకరించిన అధికారులు.. తమ బండారం బయటపడుతుందేమోనని భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బిచ్చాను పట్టుకుని విచారిస్తే ఈ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారుల వివరాలు వెలుగులోకి వస్తాయి.