నెత్తురోడ్డుతూ..మృత్యుఒడికి..
Published Tue, Nov 8 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యుఒడికి చేరారు. ఆగిఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొని ఇద్దరు, ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఒకరు, లారీ ఢీకొని మరొకరు, గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంకొకరు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారి కుటుంబాల్లో విషాదం నింపారు.
కూలి డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్తూ..
కొయ్యలగూడెం : కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం స్టేట్ హైవే మధ్య నరసన్నపాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యనగూడానికి చెందిన ధూళిపాళ శ్రీను (32), కంకరాజు వెంకన్నబాబు (28) జంగారెడ్డిగూడెంలోని సామిల్లులో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఆదివారం రాత్రి కూలీడబ్బులు తెచ్చుకునేందుకు మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. హైవేకు ఆనుకుని ఉన్న హోటల్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకన్నబాబు అవివాహితుడు. ఎస్‌సై పి.చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధులకు వెళ్తూ..
భీమడోలు : ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మోటార్‌సైకిలిస్టు దుర్మరణం పాలయ్యాడు. జాతీయ రహదారి పూళ్ల ఇందిరమ్మ కాలనీ వద్ద సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కుక్కల నాగవెంకట ప్రభాకరరావు(43) పెంటపాడులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మోటార్‌బైక్‌పై ప్రభాకరరావు విధులకు వెళ్తుండగా, ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్తున్న వాసవీ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అతివేగంగా వెళ్తూ మోటార్‌బైక్ వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభాకరరావును చికిత్స నిమిత్తం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ప్రమాదంలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. భీమడోలు ఎస్‌ఐౖ బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని వృద్ధురాలు..
పెదపాడు : రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని అప్పనవీడులో జరిగింది. పెదపాడు పోలీసుల కథనం ప్రకారం ఏపూరు గ్రామానికి చెందిన నత్తా లలితమ్మ(60) సోమవారం పల్లెర్లమూడి ప్రాంతం నుంచి అప్పనవీడు అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చింది. అక్కడ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు ఏఎస్‌సై అర్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జువ్వలపాలెంలో ఇంకొకరు..
పెంటపాడు : తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం టౌ¯ŒS ఎస్‌ఐ వీర్రాజు కథనం ప్రకారం తాడేపల్లిగూడెంకు చెందిన గోనెసంచుల వ్యాపారి నీరుకొండ శ్రీనివాస్, టీ దుకాణం యజమాని పలకా పాపారావు(40)ను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని ఆదివారం అర్ధరాత్రి తణుకు వైపు నుండి తాడేపల్లిగూడెం వస్తున్నాడు. ఆ సమయంలో వీరిని వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో వెనుక కుర్చున్న పాపారావు అక్కడి కక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement