different places
-
జనసమ్మర్ధం ఎక్కడెంత ?
న్యూఢిల్లీ: నిత్యావసరం, అత్యవసరం అంతకు మించి గుమ్మం దాటి బయటకు రావడానికే లేదు. ఇండియా మాత్రమే కాదు. అన్ని దేశాల పరిస్థితి ఇంతే. అయినా సరే బయటకు వచ్చే జనం వస్తూనే ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌కి ముందు తర్వాత పరిస్థితుల్ని పోలుస్తూ గూగుల్ మ్యాప్స్ ప్రపంచ దేశాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ తగ్గిందో ఒక నివేదిక రూపొందించింది. భౌతిక దూరం నిబంధనలపై ఆరోగ్య శాఖ అధికారులకు ఉపయోగపడడం కోసం ఈ నివేదిక రూపొందించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారే అత్యధికులు కావడంతో ఇంటిపట్టున ఉండే వారి శాతం పెరిగింది. మిగిలిన అన్ని చోట్లా జనసమ్మర్థం సాధారణం కంటే 50 శాతానికిపైగా తగ్గింది. మార్చి నెలాఖరు నాటికి భారత్‌లో జనసమ్మర్థం పరిస్థితి ఇలా ఉంది.. -
అగ్గి రేగి బుగ్గి
పెరవలి : పెరవలిలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు రేగి తాటాకిల్లు దగ్ధమైంది. ఫలితంగా రెండు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. పెరవలిలోని వీరవల్లి శ్రీరామమూర్తికి చెందిన రెండు పోర్షన్ల తాటాకు ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు రేగాయి. ఆ ఇంటిలో ఉన్న వారు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సామగ్రి కూడా తీసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో ఇంటితోపాటు సామగ్రి అంతా బూడిదైంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు అదుపుచేయడానికి స్థానికులు యత్నించినా ఫలితం లేకపోయింది. తణుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకాధికారి ఏసుబాబు అంచనా వేశారు. గ్యాస్ లీకై.. పాలకొల్లు సెంట్రల్ : స్థానిక లజపతిరాయ్‌పేటలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.లక్ష ఆస్తినష్టం జరిగింది. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. లజపతిరాయ్‌పేట నాలుగో వీధిలోని కటికిరెడ్డి నాగేంద్రప్రసాద్ ఇంటిలో టెలిఫోన్ ఎక్సేచేంజ్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సాధనాల శ్రీనివాసరావు అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య బుధవారం గ్యాస్ పొయ్యిపై జంతికలు వండుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చేశారు. ఆ మంటలు ఫ్రిజ్‌కు వ్యాపించి దానితోపాటు సిలిండర్ పేలడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. వంటింటిలోని సామగ్రి దగ్ధమయ్యాయి. మంచాలు, బీరువా, మిక్సీ, ఫ్యాన్ లు, దుస్తులు, గుమ్మాలు, కిటికీలు మొత్తం కాలిపోయాయి. బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంవత్సరం అంతా వాడుకునేందుకు ఒకేసారి తెలంగాణ నుంచి బియ్యం తెచ్చుకుంటామని, డిసెంబర్ 25న పది క్వింటాళ్ల బియ్యం తెచ్చానని, అవి మొత్తం అగ్గిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
నెత్తురోడిన రహదారులు
జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ట్రాలీ ఢీకొని ఇద్దరు, ఆటో తిరగబడి ఒకరు మృతి చెందారు.∙మోటారు సైకిల్ ఢీ కొని వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. తీపర్రు (పెరవలి) : ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కొప్పాక లక్ష్మణరావు(23), రంకిరెడ్డి సతీష్(24) వడ్రంగి పని చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. గురువారం ఉదయం పని నిమిత్తం కానూరు వెÐðళ్లారు. పని ఎక్కువగా ఉండటంతో చీకటి పడే వరకు పని చేసి రాత్రి 10.30 గంటలకు మోటార్ సైకిల్‌పై స్వగ్రామం బయలుదేరారు. తీపర్రు సమీపంలోకి వచ్చేటప్పటకి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీని గమనించక వేగంగా ఢీకొన్నారు. ఇద్దరి తలలకు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలికి చేరి కన్నీరుమున్నీరుగా విలపించారు. పెరవలి ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాత్రికి రాత్రే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. రోడ్డు దాటుతుండగా.. నిడదవోలు : పట్టణంలో గూడెం రైల్వేగేటు సమీపంలో వార్ఫ్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. రైల్వేగూడ్స్ వ్యాగి¯ŒS నుంచి బయటకు వస్తూ రోడ్డు దాటుతున్న వృద్ధుడ్ని నిడదవోలు నుంచి శెట్టిపేట వెళుతున్న మోటర్ సైకిల్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుమారు 65 ఏళ్లు వయసు ఉంటుందని, ఫ్యాంట్, చొక్కా ధరించి ఉన్నాడని పట్టణ ఎస్సై డి.భగవా¯ŒS ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆటో తిరగబడి.. పోలవరం రూరల్ : పోలవరంలో ప్రమాదవశాత్తు ఆటో తిరగబడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయంత్రం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలవరం గ్రామానికి చెందిన తాడేపల్లి వెంకటేశ్వరరావు(45) ఒక్కడే ఆటోలో ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తూ తిరగబడింది. తీవ్ర గాయాలపాలైన అతనిని పోలవరం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
నెత్తురోడ్డుతూ..మృత్యుఒడికి..
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యుఒడికి చేరారు. ఆగిఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొని ఇద్దరు, ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఒకరు, లారీ ఢీకొని మరొకరు, గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంకొకరు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారి కుటుంబాల్లో విషాదం నింపారు. కూలి డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్తూ.. కొయ్యలగూడెం : కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం స్టేట్ హైవే మధ్య నరసన్నపాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యనగూడానికి చెందిన ధూళిపాళ శ్రీను (32), కంకరాజు వెంకన్నబాబు (28) జంగారెడ్డిగూడెంలోని సామిల్లులో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఆదివారం రాత్రి కూలీడబ్బులు తెచ్చుకునేందుకు మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. హైవేకు ఆనుకుని ఉన్న హోటల్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకన్నబాబు అవివాహితుడు. ఎస్సై పి.చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధులకు వెళ్తూ.. భీమడోలు : ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మోటార్‌సైకిలిస్టు దుర్మరణం పాలయ్యాడు. జాతీయ రహదారి పూళ్ల ఇందిరమ్మ కాలనీ వద్ద సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కుక్కల నాగవెంకట ప్రభాకరరావు(43) పెంటపాడులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మోటార్‌బైక్‌పై ప్రభాకరరావు విధులకు వెళ్తుండగా, ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్తున్న వాసవీ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అతివేగంగా వెళ్తూ మోటార్‌బైక్ వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభాకరరావును చికిత్స నిమిత్తం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ప్రమాదంలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. భీమడోలు ఎస్ఐౖ బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వృద్ధురాలు.. పెదపాడు : రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని అప్పనవీడులో జరిగింది. పెదపాడు పోలీసుల కథనం ప్రకారం ఏపూరు గ్రామానికి చెందిన నత్తా లలితమ్మ(60) సోమవారం పల్లెర్లమూడి ప్రాంతం నుంచి అప్పనవీడు అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చింది. అక్కడ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై అర్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జువ్వలపాలెంలో ఇంకొకరు.. పెంటపాడు : తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం టౌ¯ŒS ఎస్ఐ వీర్రాజు కథనం ప్రకారం తాడేపల్లిగూడెంకు చెందిన గోనెసంచుల వ్యాపారి నీరుకొండ శ్రీనివాస్, టీ దుకాణం యజమాని పలకా పాపారావు(40)ను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని ఆదివారం అర్ధరాత్రి తణుకు వైపు నుండి తాడేపల్లిగూడెం వస్తున్నాడు. ఆ సమయంలో వీరిని వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో వెనుక కుర్చున్న పాపారావు అక్కడి కక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్రస్ ఓ చోట.. తయారీ మరో చోట
- వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్న బయో కంపెనీలు - ఆదోని కిసాన్ మాల్ భారీగా అక్రమాలు - 2112 లీటర్లపై స్టాప్‌సేల్స్ కర్నూలు(అగ్రికల్చర్): పేరు ఒక ప్రాంతంలో... తయారీ మరో సుదూర ప్రాంతంలో.. ఇది బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టీలైజర్ కంపెనీల తీరు ఇది. గుర్తింపు ఉన్న కంపెనీలే తప్పుడు అడ్రస్‌లతో వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్నాయి. బయో కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్తే అక్కడ వాటి జాడ లభించలేదు. అధికారికంగా జిల్లాలో 13 బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, అడ్రస్ లేని దొంగ కంపెనీలు వందల్లో ఉన్నాయి. బయో వ్యాపారంలో వ్యవసాయాధికారులే మునిగి తేలుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వేర్వేరు జిల్లాలకు చెందిన డీడీఏ, ఏడీఏ, ఏఓ స్థాయి అధికారులను స్క్వాడ్‌గా ఏర్పాటు చేసి జిల్లాలో బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలను తనిఖీలకు చర్యలు తీసుకున్నారు. బుధ, గురు వారాల్లో ఏడు తయారీ కేంద్రాలకు ఆయా కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్లి తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఇచ్చిన అడ్రస్‌లో లేవు. హైదరాబాద్, తదితర నగరాల్లో తయారు చేసి నేరుగా జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయశాఖను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు అడ్రస్‌లు ఇచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కల్లూరు మండలం బస్తిపాడు అడ్రస్‌తో ఉన్న పద్మజ క్రాప్ సైన్స్, కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని గోశాల దగ్గర అడ్రస్‌తో పవన్‌పుత్ర అగ్రి లైప్ సైన్సెస్, దిన్నెదేవరపాడులోని ఇండియన్ క్రాఫ్ కేర్, బేతంచెర్లలోని ఏఎస్ రామమూర్తి బయో కంపెనీలు వారు ఇచ్చిన అడ్రస్‌లో, పరిసరాల్లోనూ లేనట్లు స్పష్టమైంది. ఆదోనిలో కిసాన్ మాల్ పేరుతో బయో కంపెనీ ఉన్నా పలు అక్రమాలు వెలుగు చూశాయి. బయోల వివరాలు స్టాక్ రిజిస్ర్టర్లో చూపకపోవడం తదితర కారణాలతో రూ.1.56 లక్షల విలువ కలిగిని 2112 లీటర్ల బయో మందుల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీడీఏ మోహన్‌రావు సాక్షితో మాట్లాడుతూ బయోపెస్టిసైడ్ కంపెనీలు విధిగా కోర్టు స్టే ఆర్డర్ కలిగి ఉండాలని, ఆ మేరకు పత్రాలు, ఇన్వాయిస్ వివరాలు, స్టాక్ రిజిస్ర్టర్ తదితర వన్నీ ఉండాలని వివరించారు. తనిఖీలతో పాటు శ్యాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్‌కు పంపుతామని ఇందులో కెమికల్స్ ఉన్నాయని నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకా ఆరు కంపెనీలను తనిఖీ చేయాల్సి ఉందన్నారు. -
రేపటి నుంచి స్కూల్‌గేమ్స్ సెలెక్షన్స్
తణుకు: జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 12 నుంచి పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీ ఎ.సాయిశ్రీనివాస్ తెలిపారు. 12న ద్వారకాతిరుమల మండలం రాజాపంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్లో విలువిద్య పోటీలు, 14న చాగల్లు జెడ్పీ హైస్కూల్లో వాలీబాల్ పోటీలు, 15న గోపన్నపాలెం సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ఖోఖో, కబడ్డీ, హేండ్‌బాల్, టెన్నిస్, యోగా, అథ్లెటిక్స్ పోటీలు, 16న భీమవరం భారతీయ విద్యాభవన్స్‌లో హాకీ, రోప్‌స్కిప్పింగ్ పోటీలు, 17న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్విమ్మింగ్, స్కేటింగ్, రోయింగ్, జూడో, తైక్వాండ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
గండేపల్లి : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో బుధవారం ఇద్దరు మృతిచెందారు. మండలంలోని నీలాద్రిరావుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానిక హెడ్‌కానిస్టేబుల్ సూర్యప్రకాశరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీంద్రిపు అప్పారావు (34) రోడ్డు దాటుతుండగా కలకత్తా నుంచి మద్రాసు వైపు వెళ్లే లారీ ఢీకొంది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ చక్రాలు మృతుడి తలపై నుంచి వెళ్లడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య బుజ్జి, కూతురు చక్రమ్మ ఉన్నారు. ఘటనా స్థలానికి సీఐ జీవీవీ సత్యనారాయణ, గండేపల్లి ఎఎస్ఐ ఎంవీవీఎస్‌ఎన్ రాజు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మోటార్ సైకిల్ ఢీకొని వృద్ధుడి మృతి చేబ్రోలు(గొల్లప్రోలు) : చేబ్రోలు శివారు ఈబీసీ కాలనీ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కత్తిపూడి నుంచి పిఠాపురం వెళ్తున్న మోటార్‌సైకిల్ రోడ్డును దాటుతున్న గ్రామానికి చెందిన ఆవాల వెంట్రావు(60)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావుకు బలమైన గాయమైంది. ఫలితంగా అపస్మారకస్థితికి చేరాడు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని గొల్లప్రోలు పోలీసులు పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఎస్ఐ ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలువలో పడి యువకుడి దుర్మరణం కొత్తపేట : కొత్తపేట పాతరామాలయంవీధికి చెందిన వికలాంగుడు దర్ణాల సత్తిబాబు(26) ప్రమాదవశాత్తు కాలువలోపడి మృతి చెందినట్టు ఎస్సై ఎ.బాలాజీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సత్తిబాబు తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో అతని తండ్రి ఆదినారాయణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో స్థానిక గోగివారిపేట సమీపంలోని బొబ్బర్లంక-అమలాపురం కాలువరేవులో అతని మూడు చక్రాల సైకిల్, రెండు సపోర్టు కర్రలు లభించాయి. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలులో పడి గల్లంతైఉంటాడని భావించారు. సత్తిబాబు మృతదేహం బుధవారం మధ్యాహ్నం అవిడి చప్పిడివారిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద అంబాజీపేట చానల్లో తేలింది. మృత దేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాలాజీ తెలిపారు. పుట్టుకతో పోలియో వికలాంగుడైన సత్తిబాబు డిగ్రీ చదివి, కంప్యూటర్ సెంటర్ ద్వారా తాను ఉపాధి పొందుతూ మరికొందరికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. వికలాంగుల సంక్షేమ సంఘం ద్వారా సాటి వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. సత్తిబాబు మృతి పట్ల స్థానికులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.