అగ్గి రేగి బుగ్గి
అగ్గి రేగి బుగ్గి
Published Wed, Jan 18 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
పెరవలి : పెరవలిలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు రేగి తాటాకిల్లు దగ్ధమైంది. ఫలితంగా రెండు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. పెరవలిలోని వీరవల్లి శ్రీరామమూర్తికి చెందిన రెండు పోర్షన్ల తాటాకు ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు రేగాయి. ఆ ఇంటిలో ఉన్న వారు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సామగ్రి కూడా తీసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో ఇంటితోపాటు సామగ్రి అంతా బూడిదైంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు అదుపుచేయడానికి స్థానికులు యత్నించినా ఫలితం లేకపోయింది. తణుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకాధికారి ఏసుబాబు అంచనా వేశారు.
గ్యాస్ లీకై..
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక లజపతిరాయ్‌పేటలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.లక్ష ఆస్తినష్టం జరిగింది. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. లజపతిరాయ్‌పేట నాలుగో వీధిలోని కటికిరెడ్డి నాగేంద్రప్రసాద్ ఇంటిలో టెలిఫోన్ ఎక్సేచేంజ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సాధనాల శ్రీనివాసరావు అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య బుధవారం గ్యాస్ పొయ్యిపై జంతికలు వండుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చేశారు. ఆ మంటలు ఫ్రిజ్‌కు వ్యాపించి దానితోపాటు సిలిండర్ పేలడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. వంటింటిలోని సామగ్రి దగ్ధమయ్యాయి. మంచాలు, బీరువా, మిక్సీ, ఫ్యాన్ లు, దుస్తులు, గుమ్మాలు, కిటికీలు మొత్తం కాలిపోయాయి. బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంవత్సరం అంతా వాడుకునేందుకు ఒకేసారి తెలంగాణ నుంచి బియ్యం తెచ్చుకుంటామని, డిసెంబర్ 25న పది క్వింటాళ్ల బియ్యం తెచ్చానని, అవి మొత్తం అగ్గిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
Advertisement
Advertisement