బయో వ్యాపారంలో వ్యవసాయాధికారులే మునిగి తేలుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వేర్వేరు జిల్లాలకు చెందిన డీడీఏ, ఏడీఏ, ఏఓ స్థాయి అధికారులను స్క్వాడ్‌గా ఏర్పాటు చేసి జిల్లాలో బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలను తనిఖీలకు చర్యలు తీసుకున్నారు. బుధ, గురు వారాల్లో ఏడు తయారీ కేంద్రాలకు ఆయా కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్లి తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఇచ్చిన అడ్రస్‌లో లేవు. హైదరాబాద్, తదితర నగరాల్లో తయారు చేసి నేరుగా జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయశాఖను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు అడ్రస్‌లు ఇచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కల్లూరు మండలం బస్తిపాడు అడ్రస్‌తో ఉన్న పద్మజ క్రాప్ సైన్స్, కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని గోశాల దగ్గర అడ్రస్‌తో పవన్‌పుత్ర అగ్రి లైప్ సైన్సెస్, దిన్నెదేవరపాడులోని ఇండియన్ క్రాఫ్ కేర్, బేతంచెర్లలోని ఏఎస్ రామమూర్తి బయో కంపెనీలు వారు ఇచ్చిన అడ్రస్‌లో, పరిసరాల్లోనూ లేనట్లు స్పష్టమైంది.
ఆదోనిలో కిసాన్ మాల్ పేరుతో బయో కంపెనీ ఉన్నా పలు అక్రమాలు వెలుగు చూశాయి. బయోల వివరాలు స్టాక్ రిజిస్ర్టర్‌లో చూపకపోవడం తదితర కారణాలతో రూ.1.56 లక్షల విలువ కలిగిని 2112 లీటర్ల బయో మందుల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీడీఏ మోహన్‌రావు సాక్షితో మాట్లాడుతూ బయోపెస్టిసైడ్ కంపెనీలు విధిగా కోర్టు స్టే ఆర్డర్ కలిగి ఉండాలని, ఆ మేరకు పత్రాలు, ఇన్‌వాయిస్ వివరాలు, స్టాక్ రిజిస్ర్టర్ తదితర వన్నీ ఉండాలని వివరించారు. తనిఖీలతో పాటు శ్యాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్‌కు పంపుతామని ఇందులో కెమికల్స్ ఉన్నాయని నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకా ఆరు కంపెనీలను తనిఖీ చేయాల్సి ఉందన్నారు.