గండేపల్లి : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో బుధవారం ఇద్దరు మృతిచెందారు. మండలంలోని నీలాద్రిరావుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానిక హెడ్‌కానిస్టేబుల్ సూర్యప్రకాశరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీంద్రిపు అప్పారావు (34) రోడ్డు దాటుతుండగా కలకత్తా నుంచి మద్రాసు వైపు వెళ్లే లారీ ఢీకొంది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ చక్రాలు మృతుడి తలపై నుంచి వెళ్లడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య బుజ్జి, కూతురు చక్రమ్మ ఉన్నారు. ఘటనా స్థలానికి సీఐ జీవీవీ సత్యనారాయణ, గండేపల్లి ఎఎస్‌ఐ ఎంవీవీఎస్‌ఎన్ రాజు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మోటార్ సైకిల్ ఢీకొని వృద్ధుడి మృతి
చేబ్రోలు(గొల్లప్రోలు) : చేబ్రోలు శివారు ఈబీసీ కాలనీ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కత్తిపూడి నుంచి పిఠాపురం వెళ్తున్న మోటార్‌సైకిల్ రోడ్డును దాటుతున్న గ్రామానికి చెందిన ఆవాల వెంట్రావు(60)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావుకు బలమైన గాయమైంది. ఫలితంగా అపస్మారకస్థితికి చేరాడు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని గొల్లప్రోలు పోలీసులు పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి యువకుడి దుర్మరణం
కొత్తపేట : కొత్తపేట పాతరామాలయంవీధికి చెందిన వికలాంగుడు దర్ణాల సత్తిబాబు(26) ప్రమాదవశాత్తు కాలువలోపడి మృతి చెందినట్టు ఎస్సై ఎ.బాలాజీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సత్తిబాబు తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో అతని తండ్రి ఆదినారాయణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో స్థానిక గోగివారిపేట సమీపంలోని బొబ్బర్లంక-అమలాపురం కాలువరేవులో అతని మూడు చక్రాల సైకిల్, రెండు సపోర్టు కర్రలు లభించాయి. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలులో పడి గల్లంతైఉంటాడని భావించారు. సత్తిబాబు మృతదేహం బుధవారం మధ్యాహ్నం అవిడి చప్పిడివారిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద అంబాజీపేట చానల్‌లో తేలింది. మృత దేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాలాజీ తెలిపారు. పుట్టుకతో పోలియో వికలాంగుడైన సత్తిబాబు డిగ్రీ చదివి, కంప్యూటర్ సెంటర్ ద్వారా తాను ఉపాధి పొందుతూ మరికొందరికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. వికలాంగుల సంక్షేమ సంఘం ద్వారా సాటి వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. సత్తిబాబు మృతి పట్ల స్థానికులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Thu, Feb 19 2015 12:22 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement