మైలవరం : సిని ఫక్కీలో వ్యక్తి నుంచి భారీ మొత్తంలో నగదు చోరీ చేసిన సంఘటన మైలవరం బస్‌స్టాండ్‌లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగురిపాడు గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వర్లు మిర్చి వ్యాపారి(దళారి). ఇటీవల ఖమ్మం జిల్లా తల్లాడలోని రైతు వద్ద మిర్చి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయించారు.
మిర్చి అమ్మిన సొమ్ము రూ. 5.35లక్షలతో పాటు పాత బాకీ రూ. లక్ష వసూలు చేసుకుని మొత్తం రెండు ప్యాకెట్లుగా కట్టి బ్యాగులో వేసుకుని రైతుకు సొమ్ము చెల్లించేందుకు తిరుపతి-మణుగూరు బస్సులో గుంటూరు నుంచి బయలుదేరాడు. మైలవరంలో మధ్యాహ్నం భోజన విరామం కోసం బస్‌స్టాండ్‌లో బస్సు ఆపడంతో అతడు దిగి టాయిలెట్‌కు వెళ్లాడు.
ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడి వద్దకు వచ్చి బస్‌స్టాండ్‌లో దొంగతనం జరిగింది బ్యాగ్ సోదా చేయాలని చెప్పారు. బాధితుడు తన బ్యాగ్‌ను చూపించగా అందులో ఉన్న రూ. 5.35లక్షల నగదును తస్కరించి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.