
అక్రమాలు నిజమే
– 172 అభివృద్ధి పనుల్లో రూ.50 లక్షల గోల్‌మాల్
– కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత !
– అధికారులపై వేటుకు రంగం సిద్ధం
- ముందే అక్రమాలను వెల్లడించిన ‘సాక్షి’
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పరిధిలో గతేడాది జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగుచూశాయి. పాలకవర్గానికి చెందిన కొందరు నేతల సూచనలతో చేసిన తప్పిదాలు అధికారులు మెడకు చుట్టుకున్నాయి. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు టెండర్‌కు విరుద్ధంగా పనులు చేసినట్లు అధికారుల తనిఖీలో తేలింది. రూ 2.5 నుంచి రూ 3 కోట్ల బిల్లుల్లో(172 పనులు) రూ 45 నుంచి 50 లక్షల వరకు కాంట్రాక్టర్లకు కోత వేయాలని డీఎంఏ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో ఉదాసీనతతోపాటు పరోక్షంగా పాలకులకు సహకరించిన అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 10న ‘డబ్బుల్ పనులు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు డీఈలు బృందంగా ఏర్పడి 172 పనులను తనిఖీ చేశారు. ఆ నివేదిక ఆధారంగా డీఎంఏ చర్యలకు సిఫార్సు చేసింది. ఇంకా 90 పనులను తనిఖీ చేయలేదు.
నిగ్గుతేలిన అంశాలివే..!
నగరంలో ఒక రోడ్డు నిర్మాణాన్ని 5 విభాగాలు చేసి నామినేషన్ పద్ధతిన పనులు పిలవడాన్ని తప్పుబట్టారు. ఒక రోడ్డును విభజించడం సరికాదన్నారు. నగరంలో రూ లక్షతో ఏడు సీసీ రోడ్లు వేయగా అందులో 5 నాసిరకమని గుర్తించారు. సైడ్ బర్మ్స్ (మట్టిదిబ్బలు) జేసీబీ ద్వారా చేపట్టి కూలీలతో పని చేసినట్లు రికార్డులో పొందుపర్చారు. దీని ద్వారా సదరు కాంట్రాక్టర్ రూ లక్షల్లో లబ్దిపొందినట్లు తేలింది. వీటితో పాటు పదుల సంఖ్యలో పనుల్లో నాణ్యత లోపించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈకు మరో 90 పనుల(రూ1.2 కోట్లు) జాబితాను నగరపాలక సంస్థ అధికారులు జాప్యం చేశారు. దీనిపై డీఎంఏ స్పందించారు. ఎస్‌ఈ సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీ చేసి రిపోర్టు ఆధారంగా బిల్లులు చేయాలన్నారు.
అధికారుల్లో వణుకు..
అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల్లో రూ లక్షల్లో నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లడంలో సదరు అధికారులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కమిషనర్ పీ వీరవెంకట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.