రెండ్రోజుల్లో రూ.62 వేలు డ్రా! | rs.62 thousands draw in two days | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల్లో రూ.62 వేలు డ్రా!

Published Wed, Nov 23 2016 11:05 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

రెండ్రోజుల్లో రూ.62 వేలు డ్రా! - Sakshi

రెండ్రోజుల్లో రూ.62 వేలు డ్రా!

– ఖాతాదారు ప్రమేయం లేకుండానే సొమ్ము మాయం
– ఈ బ్యాంకింగ్‌ ద్వారా డ్రా చేసుకున్న వైనం
- ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ నిర్లక్ష్యంపై నిలదీత
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు


అనంతపురం : తన ప్రమేయం లేకుండా ఈ-బ్యాంకింగ్‌ ద్వారా రెండు రోజుల్లో విడతల వారీగా రూ.62వేల నగదు డ్రా అయిపోవడంతో ఖాతాదారుడు కంగుతిన్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఖాతాలోంచి గల్లంతు కావడంతో లబోదిబోమంటూ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన మేరకు... నగరంలోని బళ్లారిరోడ్డు సత్యదేవనగర్‌కు చెందిన ఇషాక్‌ బాషా, రోష్న దంపతులు. ఇషాక్‌బాషా వాహనాలకు స్టీల్‌ కోటింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోష్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పని చేస్తోంది.

ఈ నెల 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నేపథ్యంలో 12వ తేదీన కళ్యాణదుర్గం రోడ్డులోని ఆంధ్రాబ్యాంకులో ఉన్న తన ఖాతాలో ఇషాక్‌బాషా రూ. 41 వేలు జమ చేశాడు. 13న రూ.10 వేలు బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 22న ఉదయం బ్యాంకుకు వెళ్లి మరో రూ. 40 వేలు జమ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే  అసలైన సమస్య మొదలైంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రూ. 2,598 డ్రా చేసినట్లు తన మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది.

కాసేపటికి రూ.21,900,  మరో పది నిముషాలకు రూ. 2,201 ఈ- పేమెంట్స్‌ ద్వారా  డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. అంటే అర గంట వ్యవధిలో మొత్తం రూ. 26,699 డ్రా చేసేశారు. మెసేజ్‌లతో కంగుతిన్న ఇషాక్‌బాషా పరుగున బ్యాంకుకు చేరుకున్నాడు. బ్యాంకు మేనేజర్‌ భారతికి జరిగిన విషయం చెప్పాడు. 'మేడం.. నా అకౌంటులో ఇంత మొత్తం డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. ఏటీఎం కార్డు నా వద్దే ఉంది. నా ప్రమేయం లేకుండానే ఈ డబ్బంతా ఎవరో డ్రా చేసేశార'ని వాపోయాడు. 

ఇలానే ఉంటే ఖాతాలో ఉండే మిగతా డబ్బు కూడా డ్రా చేసుకునే ప్రమాదం ఉందని, ఉదయం జమ చేసిన రూ. 40 వేలు వెనక్కు ఇవ్వాల'ని కోరాడు. ఏటీఎం  బ్లాక్‌ చేస్తే సరిపోతుందంటూ బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చి ఆయన ఏటీఎంను బ్లాక్‌ చేసేశారు. ఉన్న సొమ్ము డ్రా చేసుకునే అవకాశం ఉండదంటూ చెప్పి పంపారు. దీంతో స్టేట్‌మెంట్‌ తీసుకుని బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఉదయాన్నే మరో షాక్‌..
బుధవారం ఉదయం 7.30 గంటలకు వచ్చిన మెసేజ్‌ చూసి ఇసాక్‌బాషా దంపతులు మరోసారి షాక్‌ తిన్నారు. 20 నిమిషాల వ్యవధిలో ఏకంగా రూ. 35 వేలు డ్రా అయింది. దిక్కు తెలీని దంపతులు నేరుగా బ్యాంకు మేనేజర్‌ ఇంటికి వెళ్లారు. జరిగిన విషయాన్ని మేనేజర్‌కు వివరించారు. బ్యాంకు వద్దకు రావాలని ఆమె సూచించారు. అయితే బ్యాంకుకు వచ్చాక తమ చేతుల్లో ఏమీ లేదంటూ మేనేజర్‌ చేతులెత్తేశారు.

తొలిరోజు డ్రా చేసుకున్న సమయంలోనే  వచ్చి ఫిర్యాదు చేసి.. ఖాతాల్లో ఉన్న మిగతా రూ. 40 వేలు అయినా వెనక్కు ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు.. మీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ సొమ్ము కూడా చేసేసుకున్నారని, ఇప్పుడుత మ పరిస్థితి ఏమిటంటూ నిలదీశారు. ఇందుకు బ్యాంకు సిబ్బంది సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. ఏటీఎం బ్లాక్‌  చేస్తే సరిపోతుందని భావించామని, ఇంతకు మించి తమకు తెలీదంటూ.. ఏదైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలంటూ ఉచిత సలహా  ఇచ్చారు. అనంతరం ఇషాక్‌బాషా ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. ఉన్నడబ్బంతా పోయిన తర్వాత ఫ్రీజ్‌ చేస్తే ఏం లాభమంటూ బాధితుడు వాపోయాడు. చేసేదిలేక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement