రూ. 650 కోట్లు డిపాజిట్
పదుల సంఖ్యలో మూతపడిన ఏటీఎంలు
కొన్నింటిలోనే రూ.500 కొత్త నోట్లు
వరంగల్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కారణంగా వాటి చెలామణి లేకపోవడంతో బ్యాంకుల్లో సుమారు రూ.650కోట్లకు పైగా పెద్ద నోట్లు డిపాజిట్ అయినట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, కొత్త సంవత్సరం మొదటి తేది నుంచి లావాదేవీల్లో ఇబ్బందులు తొలగిపోతాయని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించినా నోట్ల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బ్యాంకు అధికారులు ఏటీఎంలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అర్బన్ జిల్లా కేంద్రంలో ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, అంధ్రా బ్యాంకులతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తాల్లో నోట్లు డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వ్యాపారులు మొదటి వారం రోజుల్లోనే ఎక్కవ మొత్తాల్లో డిపాజిట్ చేసి అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లను సమకూర్చుకున్నట్లు తెలిసింది. కొంత మంది ఇక్కడ డిపాజిట్లు చేయకుండా హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాలకు తమకు వ్యాపార లావాదేవిల్లో భాగస్వాములతో నోట్ల మార్పిడి చేసుకున్నట్లు సమాచారం.
వరంగల్ అర్బన్ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 196 శాఖలు ఉండగా 215 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 18,50,774 మంది వినియోగదారులు ఖాతాలు కలిగి ఉన్నారు. 86 ఏటీఎంలలో డబ్బులు పెట్టకుండా మూసివేసినట్లు బ్యాంకుల అధికారులు తెలిపారు. ఇవి నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. మూసిన షెట్టర్లు తెరవలేదు. కొన్ని ఏటీఎంలు అడపదడపా డబ్బులు ఉన్నప్పుడే పనిచేస్తున్నాయి. డబ్బులు లోడ్ చేసిన రెండు, మూడు గంటలు పనిచేస్తున్నాయి. అనంతరం మళ్లీ మరుసటి రోజు వచ్చి లోడ్ చేస్తే తప్పా పనిచేయని స్థితిలో ఉన్నాయి. బ్యాంకులు ఉన్న చోట ఏర్పాటు చేసిన ఏటీఎంలు మాత్రమే నిరంతరం పనిచేస్తున్నాయి. జనవరి 1వ తేది నుంచి పలు ఏటీఎంల్లో కొత్త రూ.500నోట్లు లభ్యమవుతున్నాయి. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలో వినియోగదారులకు ఒక్క లావాదేవికి రూ.4500 వరకు ఏటీఎంల్లో డ్రా చేసుకునే వెసలుబాటు కలిగింది.