దేశ సేవలో పల్లె ‘ప్రతిభ’ | Rural girl selected for army | Sakshi
Sakshi News home page

దేశ సేవలో పల్లె ‘ప్రతిభ’

Published Sat, Sep 17 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

తల్లిదండ్రులు సుగుణవేణి, అప్పారావులతో ప్రతిభ

తల్లిదండ్రులు సుగుణవేణి, అప్పారావులతో ప్రతిభ

మారుమూల పల్లెనుంచి ఇండియన్‌ ఆర్మీకి
ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎంపికైన ఏకైక మహిళా అధికారిణి
ఇంజినీరింగ్‌ చదివినా... దేశ సేవ చేయాలన్నదే లక్ష్యం
సాక్షితో పేడాడ ప్రతిభ
 
డెంకాడ: పుట్టిందీ పెరిగిందీ గ్రామీణ నేపథ్యం. చదివింది ఇంజినీరింగ్‌... అందునా... అమ్మాయి... ఇక ఎవరైనా ఏ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గానో స్థిరపడాలనుకుంటారు. ఇంకా కాదనుకుంటే... బ్యాంకు టెస్టులు రాసి అందులో రాణించాలనుకుంటారు. కానీ ఆమె అందరికంటే భిన్నంగా ఆలోచించింది. దేశసేవ చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. అందుకు ఆర్మీ సరైన వేదిక అనుకుంది. అనుకున్నదే తడవుగా అందుకోసం దరఖాస్తు చేసింది. ఎంతో కష్టమైన ఆ ఉద్యోగం వద్దని ఎంతోమంది చెప్పారు... కానీ ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు సాగి రాష్ట్రం నుంచే లెఫ్టినెంట్‌ అధికారిణిగా ఎంపికైన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. ఆమే శ్రీకాకుళం జిల్లా కొర్లకోటకు చెందిన పేడాడ ప్రతిభ. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కొర్లకోట అనే మారుమూల గ్రామానికి చెందిన పేడాడ ప్రతిభ ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ పోస్టుకు ఎంపికై ప్రతిభ చాటింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. స్వగ్రామమైన కొర్లకోట ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకూ చదివిన ఈమె పదో తరగతి ఆమదాలవలసలోని విజ్ఞాన్‌ పాఠశాలలోను, ఇంటర్మీడియట్‌ విశాఖపట్నం పరిధి గోపాలపట్నంలోగల శ్రీచైతన్య కళాశాలలో చదివింది. అనంతరం చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలో మెకానికల్‌ విద్యను పూర్తి చేసింది.
 
 
ఏపీ నుంచి ఏకైక మహిళ
ఇండియన్‌ ఆర్మీలో 330 మంది అధికారులను ఆర్మీ ఎంపిక చేసింది. అందులో దేశ వ్యాప్తంగా 33 మంది మహిళలు ఉండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పేడాడ ప్రతిభ ఒక్కరే ఎంపికవ్వడం విశేషం. అదీ ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ విభాగంలో దేశంలో ఇద్దరు మహిళలు ఎంపిక కాగా అందులో ప్రతిభ ఒక్కరు కావటం మరో విశేషం. 12 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న పేడాడ ప్రతిభను జమ్మూ అండ్‌ కాశ్శీర్‌లో లెఫ్టినెంట్‌గా అధికారులు నియమించారు. చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజీనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్ధి కావటంతో శనివారం ఆమెను, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభ సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
 
 
కోరిక ఎలా పుట్టింది
మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట. అమ్మ పేడాడ సుగుణవేణి, నాన్న అప్పారావు ఇద్దరూ ఉపాధ్యాయులే. తొమ్మిదో తరగతి వరకూ మా వూళ్లోనే చదివి, ఆమదాలవలసలో పదో తరగతి చదివాను. అటు తరువాత విశాఖలో ఇంటర్‌ పూర్తి చేసి ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2014 సంవత్సరంలో పూర్తి చేశాను. ఒకసారి మా బందువైన ఆర్మీలో కెప్టెన్‌గా పని చేస్తున్న రవికుమార్‌ తన సెల్‌ ఫోన్‌లో ఒక మహిళా ఆర్మీ అధికారి ఫొటో చూపించారు. అప్పట్నుంచే ఇండియన్‌ ఆర్మీలో పని చేయాలని ఫిక్స్‌ అయిపోయా. 
 
 
ఎవరైనా ప్రోత్సహించారా...
అయితే చుట్టుప్రక్కల వారు నా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆడపిల్లవు కదా అందుబాటులో ఉండే ఉద్యోగాన్ని సంపాదించాలని సలహా ఇచ్చేవారు. మా అమ్మ కూడా భయపడింది. మా నాన్న మాత్రం నాకు అడ్డుచెప్పలేదు. అయినా నా నిర్ణయం మారలేదు. మొదటి ప్రయత్నం ఫెయిల్‌ అయ్యింది. రెండో ప్రయత్నంలో విజయం సాధించాను. శిక్షణ పూర్తయ్యి జమ్ము అండ్‌ కాశ్శీర్‌లోని ఇండియన్‌ ఆర్మీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ విభాగంలో లెప్టినెంట్‌ అధికారిగా నియమించారు.
 
 
ఎలా అనిపిస్తోంది...
ఇండియన్‌ ఆర్మీలో పని చేయాలన్న నా లక్ష్యం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్మీలో చేరటం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటుంది. ఆర్మీలో చేరి నా వంతు దేశ సేవ చేసే అవకాశం రావటం గర్వంగా భావిస్తున్నాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement