సాహసాల అలలపై చెరిగిపోని సంతకం.. | Lieutenant Commander Swathi Special Interview | Sakshi
Sakshi News home page

సాహసాల అలలపై చెరిగిపోని సంతకం..

Published Mon, Jun 25 2018 11:45 AM | Last Updated on Mon, Jun 25 2018 1:23 PM

Lieutenant Commander Swathi Special Interview - Sakshi

తరిణి ప్రయాణ నేవిగేషన్‌ మ్యాప్‌ చూస్తూ..పసిఫిక్‌ సముద్రంలో నౌకను నడుపుతున్న స్వాతి

విశాఖసిటీ:  సముద్రమంత సాహసం.. సాటిలేని మనోనిబ్బరం.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం.. అంతకుమించిన నైపుణ్యం.. ఇవన్నీ ఉన్నాయంటే.. ఆ అమ్మాయి కచ్చితంగా పాతర్లపల్లి స్వాతి అవుతుంది. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన ఆ అద్భుత వనిత తప్పనిసరిగా స్వాతి అవుతుంది. కేవలం ఓ  తెరచాప పడవలో ఐదు మహాసముద్రాలను అధిగమించి, భారత నౌకాదళ చరిత్రలోనే సాటిలేని అధ్యాయాన్ని లిఖించిన ఆ యువతి తప్పనిసరిగా మన విశాఖకు చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ స్వాతి అవుతుంది. ఐఎన్‌ఎస్‌వీ తరిణి నౌకలో ప్రయాణించిన ఆరుగురు మహిళల బృందంలో ఒకరైన స్వాతి, నావికా సాగర్‌ పరిక్రమ పూర్తిచేసిన నేపథ్యంలో.. తన అనుభవాలను, భావోద్వేగాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

సాక్షి: విజయవంతమైన సాహస యాత్రలో భాగస్వాములైనందుకు అభినందనలు. తరిణి విజయం గురించి మీరెలా ఫీలవుతున్నారు.?
స్వాతి: థాంక్యూ. భారత నౌకాదళ చరిత్రలో ఇదో పెద్ద విజయం. పూర్తిగా మహిళలు సాధించిన ఈ విజయాన్ని వారికి, మా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. 193 రోజుల పాటు ఐదు మహాసముద్రాల మీదుగా 21,600 వేల నాటికల్‌ మైళ్లు సాగిన నావికా సాగర పరిక్రమ నిజంగా నా జీవితంలో అతిగొప్ప మైలురాయిగా చెప్పవచ్చు.

సాక్షి: మీ విజయంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది.?
స్వాతి: ఇది ముమ్మాటికీ నాన్న కల. అమ్మ శ్రమ. ముగ్గురు కూతుళ్లను పెంచేందుకు రోజుకు 16 గంటలకు పైగా కష్టపడుతూ మా జీవితానికి ఓ మంచి భవిష్యత్తునిచ్చింది నా తల్లిదండ్రులే. సాగర పరిక్రమకు వెళ్తానని చెప్పినప్పుడు నాన్న కొంచెం ఆలోచించినా.. అమ్మ మాత్రం ధైర్యం చెప్పింది. విజయం సాధించి వెనక్కు వస్తావని వెన్నుతట్టి ప్రోత్సహించింది. వారిచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాను.

సాక్షి:   నౌకాదళంలోకి రావాలన్నది మీ ఆశయమా? దాన్ని ఎలా సాధించారు?
స్వాతి: ముందు నేను ఇండియన్‌ నేవీలోకి రావాలని అనుకోలేదు. మా నాన్న పాతర్లపల్లి ఆదినారాయణ ఇక్కడి ఇండస్ట్రియల్‌ క్యాంటీన్‌లో హెడ్‌కుక్‌. అమ్మ రాణి సెయిలింగ్‌ క్లబ్‌లో హెల్పర్‌గా పనిచేశారు. నాన్న పనిచేసే చోటుకు నేవీ అధికారులు వచ్చే వాళ్లు. వారిని చూసి తనకు అబ్బాయి పుడితే నేవీలో చేర్పించాలని అనుకున్నారు. అయితే.. ముందు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారు. మూడో బిడ్డయిన నేను కూడా అమ్మాయినే. అయినా.. నాన్న నేవీ ఆశలు వదులుకోలేదు. ఇద్దరు అక్కల కంటే చురుగ్గా నేను ఉండటంతో నన్ను ఆ దిశగా నడిపించారు. అందరిలాగానే నేనూ బీటెక్‌లో చేరుదామని అనుకున్నాను. నాన్న మాత్రం బీఎస్సీలో చేరితే.. నీలైఫ్‌ బావుంటుందని చెప్పడంతో సరే అన్నాను. నాన్న మార్గదర్శిగా నిలవడంతో నేనీ స్థాయిలో ఉన్నాను.

సాక్షి: సెయిలింగ్‌లో మీకెలా అవకాశాలొచ్చాయి.? ఆ రంగంలో మీ అనుభవం ఏమిటి?
స్వాతి: చిన్నప్పటినుంచి ఎన్‌సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందాను. సెయిలింగ్‌ నేర్చుకున్నాను. నవంబర్‌ 2011లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా నేవీలో ఉద్యోగం సాధించాను. 2013లో వైజాగ్‌ వచ్చాను. ఐఎన్‌ఎస్‌ డేగాలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్న సమయంలో కేప్‌ టూ రియో పోటీల గురించి ఇండియన్‌ నేవీకి ఆహ్వానం అందింది. ప్రతి మూడేళ్లకోసారి దక్షిణాఫ్రికా నిర్వహించే ఈ ట్రాన్స్‌ అట్లాంటిక్‌ క్రాస్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాను. సుమారు నెల రోజుల పాటు సముద్రంలో సాగే ఈ పోటీలో తరిణిలో ఉన్న లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తికా జోషి, లెఫ్టినెంట్‌ కమాండర్‌ ప్రతిభా జమాల్‌తో కలిసి ప్రయాణం చేశాను. లాంగ్‌ సెయిలింగ్‌ బోట్‌లో ప్రయాణం చేసిన మొదటి భారతీయ (నేవీ) అమ్మాయిలుగా చరిత్ర సృష్టించాం. నేవీ ఉమెన్‌ ఆఫీసర్లు కూడా సుదీర్ఘ కాలం సెయిలింగ్‌ చెయ్యగలరని నేవీకి విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ఐఎన్‌ఎస్‌వీ తరిణి ప్రయాణం.

సాక్షి: ఐఎన్‌ఎస్‌వీ తరిణి ప్రయాణం ఎలా ప్రారంభించారు.? నౌక గురించి మీ అవగాహన ఏమిటి? ఆరుగురు అమ్మాయిల బృందాన్ని ఎలా ఎంపిక చేశారు.?
స్వాతి:  నావికా సాగర పరిక్రమలో పాల్గొనాలనుకుంటున్నారా? అని నేవీ నుండి ఒకరోజు ఫోన్‌ కాల్‌ వచ్చింది. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఓకే చెప్పాను. జమాల్, వర్తికా, నేను ముగ్గురం కోర్‌టీం గా వ్యవహరించాం. ఆ తర్వాత పాయల్, విజయ, ఐశ్వర్య వచ్చారు. ఆరుగురుం కలిసి పలు ప్రాంతాలకు సెయిలింగ్‌కు వెళ్లేవాళ్లం. పకడ్బందీగా ట్రైనింగ్‌ ఇచ్చారు. ఐఎన్‌ఎస్‌వీ తరిణి నిర్మాణంలో మాకూ భాగస్వామ్యం ఉంది. ప్రతి పార్ట్‌ని ఎలా తయారు చేశారో, ఏది ఎక్కడ, ఎందుకు అమర్చారో నిర్మాణ దశలో తెలుసుకున్నాం. షిప్‌యార్డ్‌కు వెళ్లి ప్రతి పార్ట్‌ ఫిట్‌ చేసినప్పుడు చూసి నేర్చుకున్నాం. అందుకే.. తరిణి ప్రయాణంలో నౌకలో ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకోగలిగాం.

సాక్షి: పసిఫిక్‌లో తుపాను ఎదురైనప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి?
స్వాతి: 800 నాటికల్‌ మైల్స్‌ దూరంలో పసిఫిక్‌ మహా సముద్రంలో వెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ అమెరికా వద్ద తుపాను ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు చిక్కుకున్నాం. 6 నుంచి 7 గంటల పాటు బీభత్సమే. అయితే అప్పుడు మాకు భయం వేయలేదు. ఎందుకంటే భయపడేందుకు కూడా  టైం దొరకలేదు. బోట్‌ను ఎలా కంట్రోల్‌ చెయ్యాలోనని తీవ్రంగా శ్రమించాం. నిద్రపోయే సమయం లేదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాత్రి భోజనం చేసేంత వరకూ నీరు కూడా తాగలేదంటే పరిస్థితిని ఊహించుకోండి. యుద్ధం చేసినంత కష్టంగా సాగిందా ప్రయాణం. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులెదురైనా ఇంజిన్‌ను వినియోగించకూడదు. ప్రయాణం మొత్తం తెరచాపల కదలికల ద్వారా మాత్రమే చేశాం. పెద్ద పెద్ద అలలు వచ్చి మా నౌకు ఢీకొట్టేవి. లాభం లేదనుకొని అలల వైపుగా మా దిశను మార్చేసేవాళ్లం. దీనివల్ల వేరే మార్గంలోకి వెళ్లాల్సి రావడంతో మా ప్రయాణ దూరం పెరిగిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి.

సాక్షి: ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గ్రేట్‌ కేప్స్‌ను అధిగమించిన సమయంలో మీ అనుభూతి ఏమిటి?
స్వాతి: అదో అద్భుత అనుభవం. గ్రేట్‌ కేప్స్‌ దాటుతున్న సమయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయన్న ఆతృత, ఆసక్తి మాలో ఉండేది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బోట్‌ను సురక్షితంగా ఉంచాలని కెప్టెన్‌ ఆదేశించారు. మూడు కేప్స్‌ను దాటిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ప్రపంచంలో సముద్ర మార్గంలో అన్నిటికంటే క్లిష్టమైన ప్రాంతాలను అధిగమించాం. ఇలా చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

సాక్షి: ఐఎన్‌ఎస్‌వీ తరిణి ప్రయాణంతో మీరు నేర్చుకున్నదేమిటి?
స్వాతి: తరిణి ప్రయాణంలో కష్టాలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినుంచి పారిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకున్నాను. మొత్తమ్మీద ఈ నౌక నన్ను ఆల్‌రౌండర్‌ చేసింది. ఇతర నౌకలతో సమాచార అనుసంధానం ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాను, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్, మెడికల్‌ అసిస్టెంట్, ఫస్ట్‌ ఎయిడ్‌ ఎలా చెయ్యాలి ఇలా ఎన్నో విషయాల్ని నౌక నేర్పింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్‌ వైట్‌తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. హోళీ, దీపావళి, న్యూఇయర్‌.. ఇలా ప్రతి వేడుకనీ నౌకలో చేసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్‌ వైట్‌తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను.

సాక్షి: యాత్రకు సంబంధించి మీరు మరిచిపోలేని జ్ఞాపకం ఏమిటి?
స్వాతి: 2017 నవంబర్‌లో గోవాలో ఐఎన్‌ఎస్‌వీ తరిణి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎలాంటి సెటప్‌ ఉందో.. 2018 మే 21న తిరిగి గోవా చేరుకున్నప్పుడు అదే తరహా ఏర్పాట్లు చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది. రక్షణ శాఖమంత్రి, ప్లాగ్‌ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, వేదిక, బోర్డులు.. ఇలా ఏ ఒక్కటీ మారలేదు. అది చూసి.. ఇప్పటి వరకూ జరిగింది కలా..? ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామా..? అని అనిపించింది. అప్పటి వరకూ పడిన కష్టాన్ని అమ్మా నాన్నని చూసిన తర్వాత పూర్తిగా మర్చిపోయాను. నాన్న కళ్లల్లో ఆనందం చూసినప్పుడు ప్రపంచంలో అతి పెద్ద రికార్డు సాధించినంత గర్వంగా ఫీలయ్యాను. అమ్మాయి తలచుకుంటే అవలీలగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని మా తరిణి బృందం నిరూపించింది.

సాక్షి: రకరకాల వాతావరణాన్ని ఎలా తట్టుకోగలిగారు?
స్వాతి: ఒక్కో చోట ఒక్కోలా ఉష్ణోగ్రతలు మారుతూ ఉండేవి. దాదాపు సబ్‌ జీరో, మైనస్‌ ఉష్ణోగ్రతలే ప్రతి చోటా ఎదురయ్యాయి. దాదాపు 12 వేల కిలోమీటర్లు సున్న డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణం సాగించాం. విపరీతమైన చలి, హీటర్‌ లేదు, ఫ్యాన్‌లేదు. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఇది సాహస యాత్ర. అన్ని సౌకర్యాలున్నప్పుడు అది సాహసం ఎందుకవుతుంది. అందుకే.. వాటిని ఎదుర్కొన్నాం. చలిని తట్టుకునేందుకు 7 నుంచి ఎనిమిది డ్రెస్‌లు ఒకేసారి వేసుకునేవాళ్లం. అలల తీవ్రతను రాత్రి పూట గుర్తించేందుకు నైట్‌ విజన్‌ కళ్లజోళ్లు వినియోగించేవాళ్లం. పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణం సాగించినప్పుడు 45 రోజుల పాటు ఒక్క నౌక కూడా కనిపించలేదు. ఒంటరి జీవుల్లా ప్రయాణం సాగించాం.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రాష్ట్రపతి కోవింద్, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబాతో తరిణి బృందం(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement