పారదర్శకత కోసమే జీఎస్టీ | sakshi awareness programme on gst | Sakshi
Sakshi News home page

పారదర్శకత కోసమే జీఎస్టీ

Published Fri, Jun 23 2017 11:56 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పారదర్శకత కోసమే జీఎస్టీ - Sakshi

పారదర్శకత కోసమే జీఎస్టీ

-‘సాక్షి’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- సందేహాలను నిృవృత్తి చేసిన కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) కల్పన


అనంతపురం ఎడ్యుకేషన్‌/సెంట్రల్‌/రూరల్‌ : పన్ను చెల్లింపులో పారదర్శకత కోసమే కేంద్ర ప్రభుత్వం వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) చట్టాన్ని తెస్తోందని కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) కల్పన అన్నారు. జీఎస్టీ జూలై ఒకటో తేదీ నుంచి అమలుకానుంది. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్‌ ట్యాక్స్‌లు మినహా.. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఈ విధానం వల్ల ఎవరికి లాభం? ధరలు తగ్గుతాయా? లేక పెరుగుతాయా? ఏయే వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయి.  తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం  స్థానిక లలిత కళాపరిషత్‌లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్‌ మొగలి రవివర్మ అధ్యక్షత వహించారు.

ఆయన మాట్లాడుతూ ‘సాక్షి’ గతంలో  విద్యార్థులు, రైతులు, వెబ్‌లాండ్,  ప్రజా సమస్యలపై అనేక సదస్సులు  నిర్వహించిందని గుర్తు చేశారు. జూలై ఒకటి నుంచి అమలకానున్న జీఎస్టీపై సందేహాల నివృత్తికి నిఫుణులతో అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అ«ధ్యక్షుడు శేషాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి, ‘సాక్షి’ రీజినల్‌ మేనేజర్‌ జేవీఆర్‌కే రెడ్డి, జిల్లా అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగం మేనేజర్‌ శ్రీకాంత్, సీఏ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడే ఏజీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వివిధ డీలర్లు, వ్యాపారులు లేవనెత్తిన అనుమానాలను డీసీ కల్పనతో పాటు అసిస్టెంట్‌ కమిషనర్లు శేషాద్రి, సత్యప్రకాష్‌ నివృత్తి చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లోని హ్యండ్లూమ్స్‌లో పన్ను చెల్లించి దుస్తులను కొనుగోలు చేశాం. డ్యామేజ్‌ స్టాక్‌ రిటర్న్‌కు సంబంధించిన నోట్‌ ఎప్పటిలోగా అప్‌లోడ్‌ చేయాలి? – రాజేష్, వస్త్ర దుకాణ వ్యాపారి, అనంతపురం.
డీసీ : జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది. సరుకు కొనుగోలు చేసే సమయంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ మొత్తం చెల్లించి ఉంటాం. దీంతో డ్యామేజ్, అమ్మకం కాని సరుకుకు సంబంధించిన రిటర్న్‌ను ఆరు నెలల లోపు అప్‌లోడ్‌ చేయాలి.

ప్రశ్న: మిక్స్‌డ్‌ వస్తువులను (ఒక్కో వస్తువుకు ఒక్కో పన్ను శాతం ఉన్న సమయంలో) ప్యాక్‌ రూపంలో కొనుగోలు చేస్తే పన్ను ఏ విధంగా ఉంటుంది?- రామాంజనేయులు
డీసీ :  ఒక వస్తువుకు 2 శాతం, మరో వస్తువుకు 5 శాతం, ఇంకో వస్తువుకు 18 శాతం పన్ను ఉండే వస్తువులను మిక్స్‌డ్‌గా ప్యాక్‌ రూపంలో కొనుగోలు చేస్తే ఎక్కువ శాతం పన్ను ఉన్న వస్తువును పరిగణనలోకి తీసుకుని అన్ని వస్తువులకూ అదే పన్ను వేస్తారు.  

ప్రశ్న: జూలై1లోగా జీఎస్టీ ఐడీ రాకపోతే వ్యాపారుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వర్క్‌లు చేసే పరిస్థితి ఏంటి?  - జయదేవ్‌
డీసీ : జీఎస్టీలోకి లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా ఐడీ నంబర్‌ రాకపోతే ప్రొవిజన్‌ ఐడీ నంబర్‌నే జీఎస్టీ ఐడీగా పరిగణనలోకి తీసుకుంటారు.   గతంలో ప్రభుత్వం వర్కులు మంజూరు సమయంలో ఆ వర్క్‌కు సంబంధించిన పన్నును ముందస్తుగా తగ్గించేవారు. జీఎస్టీలో సైతం అదే విధానం కొనసాగుతుంది. అయితే 10 రోజుల్లోపు కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాలి.

ప్రశ్న: బెడ్ల కొనుగోలు సమయంలో ఎక్స్ఛేంజ్‌ డ్యూటీతోపాటు ట్యాక్స్‌ చెల్లించాను. ప్రస్తుతం జీఎస్టీలో మార్చుకోవడంతో నా దగ్గర చాలా సరుకు మిగిలిపోయింది. వాటి పరిస్థితి ఏంటి? - వెంకటక్రిష్ణయ్య
డీసీ :   మీరు సరుకు కొనుగోలు చేసే సమయంలో పన్ను చెల్లించి ఉంటారు. దీంతో జీఎస్టీలోకి మారినా ఎలాంటి నష్టమూ వాటిల్లదు. ఎక్స్ఛేంజ్‌ డ్యూటీ రాష్ట్ర పరిధి అయితే 60 శాతం, రాష్ట్రేతర పరిధి అయితే 40 శాతంలోపు ఉంటుంది. అయితే ప్రతి వ్యాపారీ సరుకు కొనుగోలు చేసిన బిల్లును జీఎస్టీలోకి తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి.

ప్రశ్న: జొన్నలు, రాగులు, సజ్జలకు ట్యాక్స్‌ ఉంటుందా? : - లక్ష్మీనారాయణ, అకౌంటెంట్‌, అనంతపురం
డీసీ :   ధాన్యాలకు ట్యాక్స్‌ మినహాయింపు ఉంది. అయితే బ్రాండెండ్‌ అయితే ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు చేసే సమయంలో రూ.50 వేలకు పైగా విలువ ఉన్నట్లైతే వే బిల్లులు తప్పనిసరి.

ప్రశ్న: దేశవ్యాప్తంగా జీఎస్టీని తీసుకోవద్దని చెబుతున్నారు.. ఏమి చేయాలి ?  - ఆనంద్, క్లాత్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌
డీసీ : జీఎస్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చట్టం కూడా చేశారు. కావున ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే.   ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. అందరూ ట్యాక్స్‌ పరిధిలోకి రావాలనే ఉద్దేశంతో కస్టమర్లు, డీలర్లను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీని అమలు చేస్తున్నారు.

ప్రశ్న: రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఏజెన్సీలకు మాత్రమే బిల్లింగ్‌ చేయాలా? - వెంకటరమణ, మెడికల్‌ ఏజెన్సీస్‌
డీసీ : ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ అన్‌ రిజిస్ట్రేషన్‌ షాపులకు సరఫరా చేసినా ఏదో ఒక చోట ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి ప్రొవిజనల్‌ ఐడీ తీసుకోవాలి. పాన్‌ కార్డు సమస్య వలన ఐడీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరికైతో ప్రొవిజనల్‌ ఐడీ రాలేదో వారు అప్‌డేట్‌ చేసుకోవాలి.

ప్రశ్న: బ్రాండెడ్‌ కాకపోయినా ఒక గుర్తుతో బియ్యం సరఫరా చేస్తే ట్యాక్స్‌ చెల్లించాలా? - సురేష్, బియ్యం వ్యాపారి
డీసీ : ఒక సింబల్‌ తో వ్యాపారం చేస్తే దానిని బ్రాండెడ్‌ అంటారు. ఆ గుర్తుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి ఒక్కరూ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement