జీతాలు చాలకపోతే భిక్షాటన చేయండి
Published Wed, Jul 20 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
అనంతపురం ఎడ్యుకేషన్ : జీతాలు చాలకపోతే భిక్షాటన చేయమనండి .. అంతే కానీ అడ్మిషన్ల సమయంలో, టీసీలు ఇచ్చే సమయంలో ఇలా డబ్బు వసూలు సరికాదని హెచ్‌ఎంలను ఉద్ధేశించి డీఈఓ అంజయ్య మండిపడ్డారు. స్థానిక సైన్స్ సెంటర్‌లో మంగళవారం ఎంఈఓల సమావేశం నిర్వహించా రు. అయితే విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని, కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్ల ఫీజులు వసూలు చేస్తున్నారని, టీసీలు ఇచ్చేందుకు డబ్బులు దండుకుంటున్నారన్నారు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకోలేని అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఈఓ హెచ్‌ఎంలపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నా చాల్లేదా.. అలా అయితే అడుక్కోండంటూ మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం రూపాయి కూడా వసూలు చేయకూడదనే విషయం తెలీదా అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో గుర్తింపు ఒకచోట ఉంటే తరగతులు మరోచోట నిర్వహిస్తున్నారని, అసలే గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డీఈఓ దృష్టికి తెచ్చారు. దీంతో అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని డీఈఓ ఎంఈఓలను ఆదేశించారు. ఎన్నిమార్లు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సమావేశాన్ని రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పట్టుబట్టారు. అక్కడే బైఠాయించారు. చివరికి డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమార్ నాయుడు, రమేష్, నగర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, నాయకులు ఆలం, రాజు, విష్ణు పాల్గొన్నారు.
Advertisement
Advertisement