తప్పుడు పత్రాలకు పచ్చజెండా | Sales plots with fake degrees | Sakshi
Sakshi News home page

తప్పుడు పత్రాలకు పచ్చజెండా

Published Tue, Apr 4 2017 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

తప్పుడు పత్రాలకు పచ్చజెండా - Sakshi

తప్పుడు పత్రాలకు పచ్చజెండా

ఆక్రమణలకు రెవెన్యూ అధికారి అండ
విలువైన 4వేల గజాల స్థలం కబ్జాకు యత్నాలు
నకిలీ పట్టాలతో ప్లాట్ల విక్రయాలకు బేరసారాలు
అగనంపూడిలో రియల్టర్‌ అక్రమ దందా
తెర వెనుక టీడీపీ మాజీ కార్పొరేటర్, ప్రజాప్రతినిధి అనుచరుడు
గతంలో నమోదైన కేసులు బుట్టదాఖలు?


లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి..సొమ్ము చేతులు మారిపోతోంది.. ప్లాట్ల విభజన.. స్థలం చదును కార్యక్రమాలు కూడా చకచకాసాగిపోతున్నాయి.. మొత్తానికి కోట్ల విలువైన నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలం.. ప్రైవేట్‌ ప్లాట్లుగా మారిపోతోంది.. దీని వెనుక పాత్రధారి ఓ రియల్టర్‌ కాగా.. ఓ టీడీపీ మాజీ కార్పొరేటర్, మరో ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు సూత్రధారులుగా చక్రం తిప్పుతున్నారు.. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన తహసీల్దార్‌ వారికి వెన్నుకాస్తున్నారు.. తన కింది సిబ్బంది ఆ ఛాయలకు పోకుండా అడ్డుచక్రం వేశారు. గతంలో వారు స్వాధీనం చేసుకున్న జేసీబీని తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అప్పట్లో ఆక్రమణదారులపై నమోదు చేసిన కేసుల జోలికి వెళ్లకుండా అడ్డుగా నిలుస్తున్నారు. ఇదేమిటని అడిగితే వారు చూపిన పట్టాలు నిజమైనవేనని సమర్థించుకుంటున్నారు.. రుజువేమిటంటే తన ఆఫీసులో రికార్డు కాపీలు లేవని సెలవిస్తున్నారు.

గాజువాక: గాజువాక మండలం అగనంపూడి సర్వే నంబర్‌ 42లో ఉన్న సుమారు నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలంపై ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అధికార టీడీపీ నేతలను ఆశ్రయించాడు. వారి దన్నుతో అక్రమణ పర్వానికి తెర తీశాడు. శనివాడ మూడు రోడ్ల సమీపంలోని వేపచెట్టు జంక్షన్‌ వద్ద గల ఈ ఖరీదైన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించడానికి స్కెచ్‌ వేశాడు. మార్కెట్‌ ధర ప్రకారం గజం సుమారు రూ.30 వేలు పలుకుతుండటంతో తొలుత 1200 గజాల స్థలాన్ని తొమ్మిది ప్లాట్లుగా విభజించి నకిలీ పట్టాలు సృష్టించారు. ఒక్కో ప్లాట్‌ను రూ.15 లక్షలు చొప్పున అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకొని కొంతమంది నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. ప్లాట్లను అభివృద్ధి చేయడానికి జేసీబీతో స్థలాన్ని చదును చేయించే పనులు కూడా ప్రారంభించడంతో స్థానికుల నుంచి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీనిపై స్పందించిన కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పనులను ఆపించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుడిపై దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధిత ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దాంతో ఆక్రమణదారుడి తరఫున మాజీ కార్పొరేటర్‌తోపాటు ప్రజాప్రతినిధి కీలక అనుచరుడు రంగంలోకి దిగి రెవెన్యూ అధికారి దన్నుతో మంత్రాంగం నడిపారు. వారి అడుగులకు మడుగులొత్తిన రెవెన్యూ అధికారి జేసీబీని విడుదల చేశారు. దాదాపు మూడు నెలల విరామం తరువాత ఆక్రమణదారుడు ప్రభుత్వ స్థలంలోని హెచ్చరిక బోర్డును అక్కడ్నుంచి చివరకు జరిపాడు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులుగానీ, సిబ్బందిగానీ అటువైపు కన్నెత్తి చూడటం మానేశారు.

ఆక్రమణదారుడికి కొమ్ముకాసిన అధికారి
ఆక్రమిత స్థలానికి కబ్జాదారుడు సృష్టించిన పట్టాలు నిజమైనవిగా తహసీల్దార్‌ ధ్రువీకరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారుడు చూపించిన పట్టాలకు కార్యాలయంలో ఎలాంటి నకళ్లు లభించలేదు. అతడిపై కేసు నమోదైన మూడు వారాల తరువాత గుట్టచప్పుడు కాకుండా ఆ పట్టాలను నిజమైనవిగా నిర్థారిస్తూ ఎండార్స్‌మెంట్‌ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఆ స్థలానికి ఆనుకొని వుడా అనుమతి పొందిన ప్రైవేట్‌ లే అవుట్‌ ఉంది. ఆ లే అవుట్‌ ఏర్పాటు సమయంలో ప్రస్తుత ఆక్రమిత స్థలానికి ఆనుకొని 60 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. రోడ్డు స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి సంబంధిత నాయకులు, ఆక్రమణదారుడు దాన్ని తమ పట్టాల్లో 40 అడుగుల రోడ్డుగా చూపించారు. ఆ రోడ్డుకు ఆనుకొని జీవీఎంసీ నిధులతో కాలువలు కూడా నిర్మించారు.

ఆ కేసుల సంగతేంటో...
ఆక్రమణదారుడిపై నమోదు చేసిన కేసుల విషయాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం దాటవేస్తున్నారు. స్థలంలో పని చేస్తున్న జేసీబీని వీఆర్వో శశిధర్‌ తమ సిబ్బందితో వెళ్లి గత ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. 16న దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో వారు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడి పెరగడంతో అసలు నిందితుడిని తప్పించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో పని చేస్తున్న కార్మికులపైన, జేసీబీ డ్రైవర్‌పైన కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 447, సెక్షన్‌ 427 రెడ్‌విత్‌ 34 ఐపీసీతోపాటు ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు సెక్షన్‌ 3, 4 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇన్ని సెక్షన్ల ప్రకారం నమోదు చేసిన కేసులు ఇప్పుడు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిందితులు మళ్లీ పావులు కదుపుతున్నారు.

పట్టాలకు ఓసీలను పరిశీలిస్తాం...
ఆ సర్వే నంబర్‌లో కొంతమంది పేదలకు గతంలో పని చేసిన తహసీల్దార్‌ జ్యోతిమాధవి నివాస పట్టాలు జారీ చేశారు. లబ్ధిదారులు వాటిని తనవద్దకు తెచ్చి చూపగా.. పరిశీలించి నిజమైనవిగా నిర్థారించాను. ప్రస్తుతం వాటికి సంబంధించిన నకళ్లుగాని, ఆఫీస్‌ కాపీలుగాని లభించడంలేదు. మాది పెద్ద కార్యాలయం. ఫైళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కనిపించలేదు. మళ్లీ మా సిబ్బందితో వెతికిస్తాను. ఆ స్థలాలను లబ్ధిదారులే అనుభవించాలి. ఆ పట్టాలతో వ్యాపారం చేసే కార్యక్రమానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.వి.ఎస్‌.రవి, గాజువాక తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement