కోర్టు చెప్పినా అదే తీరు | Same situation in Scavenger colony in Tirupati | Sakshi
Sakshi News home page

కోర్టు చెప్పినా అదే తీరు

Published Tue, Aug 22 2017 2:55 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

కోర్టు చెప్పినా అదే తీరు

కోర్టు చెప్పినా అదే తీరు

► పేదల కాలనీపై మళ్లీ దౌర్జన్యం
తెల్లారకుండానే చుట్టుముట్టిన అధికారులు
► న్యాయస్థానం ఉత్తర్వులపై కొత్త నాటకం      
► భయాందోళన చెందిన గిరిపుత్రులు
► మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు
► తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీలో ఉద్రిక్తత


నిరుపేదలు నివసించే ఆ కాలనీపై అధికార పార్టీ నేతల దృష్టి మారడం లేదు. ఎలాగైనా కాలనీని కైవసం చేసుకోవాలనుకుంటున్న వారి కుయుక్తులకు అధికారుల దూకుడు తోడయ్యింది. దీంతో ఆ పేదలంతా హడలిపోతున్నారు. కంటిమీద కునుకు లేదు. కోర్టు ఉత్తర్వులను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారు. కాలనీని ఖాళీ చేయించడానికి కదులుతున్నారు. పోలీసుల సాయంతో దండెత్తుతున్నారు. సోమవారం మరోమారు అధికారులు విజృంభించడంతో బాధిత గిరిజనులు కలవరం చెందారు.

ఇదేం న్యాయం..
కోర్టు చెబితే వింటారనుకున్నాం. ఆఫీసర్లు అదేం పట్టించుకోలేదు. తెల్లారకుండానే మా ఇళ్లమీదకు వచ్చారు. ఖాళీ చేయమంటున్నారు. పోలీసులను కూడా తీసుకొచ్చా రు. ఏం చేయాలో తెలియడం లేదు. మాకు నిద్ర పట్టడం లేదు. ఇష్టం లేకపోయినా వెళ్లిపోమంటున్నారు. ఏవో కాయితాలు తెచ్చి సంతకం పెట్టమంటున్నారు. భయంగా ఉంది. ప్రభుత్వానికి మా పేదో ళ్ల గుడిసెలే కనిపించాయా.. ప్రాణాలయినా ఇస్తాం గాని ఇల్లు ఖాళీ చేయం. – గంగమ్మ, స్కావెంజర్స్‌ కాలనీ

తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీలో సోమవారం మళ్లీ అలజడి మొదలైంది. మూడు రోజుల క్రితం ఈ కాలనీని ఖాళీ చేయించేందుకు పోలీసుల సాయంతో మున్సిపల్‌ అధికా రులు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కాలనీలోని పేదల పక్షాన పలు ప్రజా సంఘాలు ముందుకొచ్చి అండగా నిలిచాయి.  అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడమని హెచ్చరించాయి. గిరిపుత్రులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని గుర్తించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు(తిరుపతి) సుమోటోగా స్వీకరించింది. బలవంతంగా ఖాళీ చేయి స్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

కాలనీని యథావిధిగా ఉంచా లని మర్నాడు హైకోర్టు  స్టేటస్‌ కో విధించింది. దీంతో అధికారులు మాట మార్చారు. ఇష్టం ఉన్న వారిని తరలిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరదీశారు. సోమవారం సోమవారం ఉదయం 5.30 గంటలకే స్కావెంజర్స్‌ కాలనీలో పోలీసు బలగాలను తీసుకుని అడుగు పెట్టారు. అప్పటికే గిరి పుత్రులు పారిశుద్ధ్య విధులకు వెళ్లిపోయారు. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న కార్మికులు పరుగున కాలనీకి చేరుకున్నారు.

‘ఈ ఇల్లు ఎవరిది, మీదేనా, ఎక్కడ పనిచేస్తారు, మీ మేస్త్రీ, సూపర్‌ వైజర్‌ ఎవరంటూ సిబ్బంది ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానానికి ఛాన్స్‌ ఇవ్వకుండా తాము చెప్పింది వినాలని, తక్షణమే ఇల్లు ఖాళీ చేసి చెప్పిన చోటకు వెళ్లాలంటూ వారు హుకుం జారీ చేశారు. అప్పటికే ఓ ఇంటిని తొలగించారు. వెంటనే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుని కాలనీ వాసులకు మద్దతుగా నిలిచారు. స్టేటస్‌ కో ఉన్నప్పుడు ఇంటిని ఎలా కూల్చేస్తారని అధికారులను నిలదీశారు.

వంటా వార్పుతో నిరసన...
కాలనీలో బాధితులతో కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు ఆందోళన  చేపట్టారు. అధికారులు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అధికారులు వెనక్కి వెళ్లకపోవడంతో అక్కడే వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్సీ సుధాకర్‌ రెడ్డి, సిఐలు శ్రీనివాసులు, భాస్కర్‌లు చేరుకున్నారు.  అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులతో మాట్లాడిన డిఎస్పీ తాము ఎవ్వరినీ ఖాళీ చేయించడం లేదని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement