
ఇసుక భోజనం!
► నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర
► నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
► నిబంధనలు పట్టకుండా నదిలో అడ్డగోలు తవ్వకాలు
► ప్రతినిత్యం వందల కొద్దీ లారీల్లో ఇసుక తరలింపు
► దళారీ అవతారమెత్తిన తెలంగాణ ఎండీసీ
► బోధన్ రెవెన్యూ డివిజన్‌లో సాగుతున్న దందా
► మాఫియాతో కుమ్మక్కై కళ్లు మూసుకున్న అధికారులు
► తవ్వాల్సింది 2.1 మీటర్లు.. తోడేస్తోంది.. 6-8 మీటర్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఇసుక తవ్వకాల్లో రాష్ర్ట సర్కారు తీసుకువచ్చిన సంస్కరణలను సైతం మాఫియా లెక్కచేయడం లేదు! కాంట్రాక్టర్ల ముసుగులో అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతూ సర్కారు కంట్లో ‘ఇసుక’ చల్లుతోంది. నిబంధనలు గాలికొదిలి ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా.. అధికారులు కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో మంజీర నది నుంచి అక్రమంగా తవ్విన ఇసుక నిత్యం వందల కొద్దీ లారీల్లో హైదరాబాద్ సహా కర్ణాటకకు తరలిపోతోంది.
ఈ మొత్తం తతంగంలో రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) దళారీ పాత్ర పోషిస్తుండడం గమనార్హం. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి, బోధన్ మండలాల పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని మాచినూరు, గంజిగామ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినివ్వగా.. ఇసుక మాఫియా తెలంగాణ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు కిమ్మనడం లేదు!
అన్ని రీచ్‌ల్లో మాఫియా రంగ ప్రవేశం
ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో టీఎస్‌ఎండీసీని రంగంలోకి దింపింది. మూడు నెలల కిందట జిల్లా ఖనిజాభివృద్ది సంస్థ, భూగర్బ జలవనరుల శాఖ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వే చేసి 8 ఇసుక రీచ్‌లను గుర్తించాయి. కోటగిరి మండలం కారేగావ్, పొతంగల్‌లతో పాటు బిచ్కుంద, బీర్కూరు, బోధన్ మండలాల్లో మరో ఆరు రీచ్‌లను ఇందులో ప్రతిపాదించారు. మొత్తం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తీయవచ్చని అధికారుల బృందం భావించింది. ఈ మేరకు ఆ క్వారీల కోసం దరఖాస్తు చేసుకున్న పట్టాదారులకు అనుమతులు ఇచ్చారు. టీఎస్‌ఎండీసీ అధికారుల పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఇసుక తరలించాలని ఆదేశించారు.
కోటగిరి, బోధన్, బిచ్కుంద, బీర్కూరు మండలాల్లో క్వారీలను 45 రోజుల కిందట ప్రారంభించారు. ఇందులో బోధన్ మండలం మందర్న, బిచ్కుంద మండలం బరంగేడ్గిలో కొద్దిరోజులకే నిలిచిపోగా.. కోటగరి మండలం కారేగావ్, పొతంగల్, బీర్కూరు, బిచ్కుంద మండలంలోని పుల్కల్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన ఇసుక మాఫియా కుమ్మక్కై నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కుతున్నారు. మంజీర నుంచి యంత్రాల ద్వారా తీస్తూ ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.
కొత్త పాలసీకి తూట్లు..
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదు. కారేగామ్, పొతంగల్, బీర్కూరు, పుల్కల్ క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 300 నుంచి 500 లారీల ఇసుక వెళ్తున్నా నిఘా లేదు. వే బిల్లులు, పర్మిట్లు లేకున్నా కర్ణాటకలోని బీదర్, ఔరాద్‌కు రాత్రి పూట కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే అనుమతులు ఒకచోట ఉంటే తవ్వకాలు మరోచోట చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 2.1 మీటర్ల వరకే ఇసుక తీయాల్సి ఉండగా.. 6 నుంచి 8 మీటర్ల దాకా తోడేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయాలన్న నిబంధనలనూ పాటించడం లేదు. రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపి ఇసుక తరలిస్తున్నారు.
రాత్రిపూట జేసీబీ యంత్రాలు క్వారీలో ఉండవద్దన్న ఆదేశాలకూ దిక్కులేదు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కారేగాంలో అక్రమ తవ్వకాల అంశం మంత్రి హరీశ్‌రావు దృష్టికి వెళ్లింది. సీరియస్‌గా తీసుకున్న మంత్రి.. అధికారులను మందలించడంతో పాటు ఇసుక తవ్వకాల నిలిపివేతకు ఆదేశించించారు. అక్రమ తవ్వకాల నేపథ్యంలో బిచ్కుంద, కోటగిరి, బీర్కూర్ మండలాల్లో గత అక్టోబర్‌లో ఏడు క్వారీలను సీజ్ చేసిన ప్రభుత్వం.. అక్రమార్కులపై చర్యలను మాత్రం పట్టించుకోవడం లేదు.