- వెల్లువెత్తుతున్న నాటుసారా
- ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో తయారీ
- రాజమహేంద్రవరంలో విచ్చలవిడిగా అమ్మకాలు
- ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తున్నా బెదరని తయరీదారులు
కానరాని నవోదయం
Published Tue, Jan 10 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా నాటుసారా వెల్లువెత్తుతోంది. సారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ‘నవోదయం’ పేరుతో అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఎక్కడా ఫలితాలనివ్వడంలేదు. నాటుసారాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పలు చర్యలు చేపడుతున్నా, కేసులు నమోదు చేస్తున్నా తయారీదారులు ఎక్కడా బెదరడంలేదు. అధికారుల కన్నుగప్పి ఎప్పటికప్పుడు తయారీ కేంద్రాలను మారుస్తున్నారు. విచ్చలవిడిగా నాటుసారా తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేసిన నాటుసారా పల్లెలు, పట్టణాలు, నగరాలను ముంచెత్తుతోంది. బడ్డీకొట్లు, నివాస గృహాలు నాటుసారా విక్రయ కేంద్రాలుగా మారాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి నిఘాలో ఈ వ్యవహారం తెటతెల్లమైంది. ‘సాక్షి’ నిఘా విభాగం రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో విక్రయకేంద్రాలను పరిశీలించింది. కొంత మంది విక్రయదారులు ఈ విషయం పసిగట్టి తమ వద్ద సరుకు అయిపోయిందని చెప్పగా, మరి కొంతమంది నగదు తీసుకున్న తర్వాత అనుమానం వచ్చి సరుకు అయిపోయిందని, వచ్చేందుకు అరగంట పడుతుందని నగదు తిరిగి ఇచ్చేశారు. పలు దుకాణాల్లో నాటుసారాను ప్యాకెట్లుగా కట్టి పార్శిల్ ఇచ్చారు. రూ.10, రూ.20 చొప్పున నా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి.
తోటలు, లంకల్లో తయారీ
ప్రయాణానికి అనువుగాలేని మారుమూలన ఉన్న తోటలు, గోదావరి లంకల్లో బట్టీలు ఏర్పాటు చేసి నాటుసారా తయారు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని వెంకటనగరం, పిడింగొయ్యి, కవలగొయ్యి, రాజానగరం మండలంలో శ్రీరాంపురం, రఘునాథపురం, రాధేయపాలం తోటలు, గోదావరిలో ఉన్న కేతవారిలంక, బ్రిడ్జిలంక తదితర ప్రాంతాల్లో నాటు సారా విచ్చలవిడిగా కాస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆటోలల్లో రవాణా చేస్తున్నారు.
నగరంలోకి...
వెంకటనగరం, పిడింగొయ్యి, కవలగొయ్యి ప్రాంతాల్లో తయారు చేసిన నాటుసారా రాజమహేంద్రవరం నగరానికి చేరుస్తున్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సారా ఎక్కువగా విక్రయిస్తున్నారు. నగరంలోని క్వారీ మార్కెట్, ఆనంద్‌నగర్, గాదిరెడ్డి నగర్, అన్నపూర్ణమ్మపేట తదితర ప్రాంతాల్లో వీధి వీధిలో విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీరు నగరంలోని స్టాక్ పాయింట్ల నుంచి ప్లాస్టిక్ టిన్నుల్లో సారా తెచ్చి విక్రయిస్తున్నారు. అక్కడ తాగే వారికి గ్లాసు రూ.10ల చొప్పన విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి అమ్ముతున్నారు.
బలవుతున్న పేదలు
నాటు సారాకు ఎక్కువగా పేదలు బలవుతున్నారు. కూలిపని చేసుకునే వారు తమ రోజు వారీ సంపాదన అధిక భాగం నాటు సారాకే ఖర్చు చేస్తున్నారు. నిత్యం ఈ సారా తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరో వైపు మద్యం మత్తులో గొడవలు పడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.
చర్యలు చేపడుతున్నా ఫలితం శూన్యం
సారా తయారు చేయడం, నిల్వ ఉంచడం, అమ్మకాలు చేసే ప్రాంతాలను అధికారులు ఏ, బీ, సీలుగా విభజించారు. సారా వల్ల కలిగే దుష్ఫలితాలపై ఆయా ప్రాంతాల్లో కళాజాతాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ఏ,బీ,సీ ప్రాంతాలను దత్తత తీసుకున్నారు. ఆయా ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టారు. రాజమహేంద్రవరం, పెద్దాపురం ప్రాంతాల్లో సారా కాస్తున్న ఇద్దరిపై అబ్కారీశాఖ అధికారులు పీడీ యాక్డులు ప్రయోగించి జైలుకు తరలించారు.
‘నవోదయం’ పేరుతో నాటుసారా కాసేవారికి, తాగేవారికి అవగాహన కల్పించాం. 110 సీఆర్‌పీసీతో పాటు పీడీ చట్టం ప్రయోగించాం. గ్రామాల్లో 80 శాతం వరకూ నాటుసారా అమ్మకాలు తగ్గాయి. రాజమహేంద్రవరం నగరం భౌగోళిక పరంగా నేరగాళ్లకు అనుకూలంగా ఉంది. లంకలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మేము దాడుల చేస్తున్నా నాటుసారా కాసేవాళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తున్నారు. సారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– లక్షీ్మకాంత్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం
Advertisement
Advertisement