
పింఛన్ కోసం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
తాడ్వాయి: వృద్ధాప్య పింఛన్ రావడం లేదని మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పైడి నర్సింహారెడ్డి(65) గురువారం రాత్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజు మాది రిగానే మండల పరిషత్ అటెండర్ కార్యాలయం వచ్చి తాళం తీసే సమయంలో నర్సింహారెడ్డి శవాన్ని గుర్తించాడు.
అనంతరం అధికారులకు సమాచారం అందించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మిని సంప్రదించగా నర్సింహారెడ్డి దేవాయిపల్లి గ్రామంలో ఉండడం లేదని, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడన్నారు. స్థానికంగా ఉన్నట్లు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పింఛన్ ఇప్పించలేక పోయామన్నారు.